ఈ ప్రపంచంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న రంగాలలో బిజినెస్, సాఫ్టువేర్, సోషల్ మీడియా పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. అప్డేట్ పరంగా ఎప్పుడూ ఈ రంగాల పేర్లే వింటే ఎవరికైనా రొటీన్ అనిపిస్తుంది. కానీ.. మీరు గమనించారో లేదో.. కొన్నాళ్లుగా అప్డేట్స్ లో సినీ ఇండస్ట్రీ పేరు కూడా వినిపిస్తోంది. అవును.. సినీ ఇండస్ట్రీ అప్డేట్ అయ్యింది.. ఇంకా అవుతున్న మాట వాస్తవమే. ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు బాగా ఆడితేనే ఆయా ఇండస్ట్రీల క్రేజ్ పెరుగుతుంది. ఇండియాలో ఒకప్పుడు బాలీవుడ్ పేరు ఎక్కువగా వినిపించేది.. స్టోరీస్ రొటీన్ అయినా గ్లామర్ టచ్ తో లాగించేవారు. సౌత్ లో స్టోరీస్ బేస్ మీద సినిమాలు తీసేవారు.
సౌత్ లో కూడా ముఖ్యంగా తమిళ, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలపై ఎక్కువ బజ్ క్రియేట్ అయ్యింది. టాలీవుడ్ మాత్రం ఇంకా కమర్షియల్ ఫార్ములాస్ దగ్గరే ఆగిపోయింది. ఒక భాషకు చెందిన ఇండస్ట్రీ హైలెట్ అయ్యిందంటే.. ఆ ఇండస్ట్రీ నుండి ఉత్తమ సినిమాలు, ఉత్తమ కథలు, క్యారెక్టరైజేషన్స్, సినిమాలలో విలువలు ఉన్నాయని దానర్థం. గతంలో అంటే.. అన్ని ఇండస్ట్రీల నుండి గొప్ప కథలను, గొప్ప ఎమోషన్స్ ని చూపించేందుకు ట్రై చేసేవారు దర్శకనిర్మాతలు. అప్పట్లో గ్లామర్, గ్లాఫిక్స్ లకి ప్రాధాన్యత తక్కువ. సినిమాలలో మసాలా కంటెంట్ పై కాకుండా కథాకథనాలు, క్యారెక్టర్స్, మంచి సంగీతం పై ఫోకస్ పెట్టేవారు.
రానురాను ఆ ఫోకస్ లో మార్పులు జరిగి.. ఇప్పుడు ఫోకస్ అనేది కొత్తకొత్త కథాకథనాలపై క్షీణించి.. మాస్ మసాలా, కమర్షియల్ ఎలిమెంట్స్, గ్రాఫికల్ ఎలివేషన్స్ పై ఎక్కువ పెడుతున్నారు. అయినా.. ట్రెండ్ కి తగ్గట్టుగా మలయాళం, తమిళ ఇండస్ట్రీలు కొత్త కథలను ఇండస్ట్రీకి అందిస్తూనే ఉన్నారు. అలా సూపర్ హిట్ అయిన కథలను వేరే భాషలవారు అనువదించు కోవడమే ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో కొత్త కథలను పరిచయం, కాన్సెప్ట్ లను పరిచయం చేస్తున్నవారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. అంటే.. మిగతావారు కొత్తగా తీయట్లేదా అంటే.. కొత్త సినిమాలు తీస్తున్నారు, కానీ కథలు కొత్తగా ఉండటం లేదు.
గత మూడు నాలుగేళ్లుగా గమనిస్తే.. తెలుగులో రీమేక్స్ ఎక్కువగా వచ్చాయి. స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు కొత్త కథల గురించి కాకుండా.. రెగ్యులర్ మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్, ఐటమ్ సాంగ్స్, రొమాన్స్, లిరిక్స్ అర్థం కాకుండా పాటలు ఉండేలా చూసుకుంటున్నారు. ఓటిటిలు వచ్చాక జనాలు బాగా అప్డేట్ అయ్యారు. అన్ని భాషల సినిమాలు చూస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా మలయాళం, తమిళ సినిమాలను సజెస్ట్ చేసుకుంటున్నారు. కానీ.. తెలుగు సినిమాల గురించి ఎవరు పెద్దగా మాట్లాడుకోరు. అలా మాట్లాడుకోవాలంటే సినిమాలో కొత్త కథాకథనాలు అయినా ఉండాలి లేదా సరైన స్క్రీన్ ప్లేతో ఎక్జిక్యూషన్ అయినా కరెక్ట్ గా జరగాల్సి ఉంది.
కరోనా తర్వాత తెలుగులో గొప్ప కథలుగా చెప్పుకునే సినిమాలు ఎన్ని వచ్చాయి? ఆలోచించండి. ఆర్ఆర్ఆర్, బింబిసార, అఖండ, క్రాక్ లాంటి పెద్ద హిట్స్ ఉన్నాయి. వాటిని గొప్ప కథలుగా భావించే వారికంటే స్టార్ కాస్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. కార్తికేయ 2, సీతారామం, అశోకవనంలో అర్జున కళ్యాణం మంచి కథలు అనుకుంటే.. ఇలాంటి కథలు ప్రతి ఏడాది ఎన్ని వస్తున్నాయి. ఒక స్టార్ హీరోతో సినిమా ఛాన్స్ దొరికితే.. గొప్ప కథలు, అంశాల గురించి కాకుండా.. మనం ఇంకెన్ని ఎలివేషన్స్ రాసుకోవచ్చు అనే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పైగా ఆడియెన్స్ ఆలోచన తీరు అలాగే ఉందని, ఎలివేషన్స్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్నారు అని వాదన.
అలా అనుకుంటే.. రెగ్యులర్ ఫార్ములాలో కూడా కొత్త సినిమాలు, విభిన్నమైన కథాంశాలతో వచ్చిన సినిమాలున్నాయి. జనాలు ఇప్పుడు అప్డేట్ అయ్యారు.. కొత్తసీసాలో పాతసారానే నింపి తీసుకొస్తే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఈ విషయం పెద్ద హీరోల సినిమాల విషయంలో కూడా ప్రూవ్ అయ్యింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసిన డైరెక్టర్ రాజమౌళినే రీసెంట్ గా ప్రెజెంట్ కంటెంట్, సినిమా రైటింగ్ పరంగా మలయాళం, తమిళ ఇండస్ట్రీలు బెస్ట్ అనిపిస్తున్నాయని స్వయంగా చెప్పడం విశేషం. ఆ లెక్కన తెలుగు ఇండస్ట్రీలో కథలు ఎలా వస్తున్నాయో చూడండి. కమర్షియల్ గా టాలీవుడ్ ఇండియాలో టాప్ కి వెళ్ళింది.. కానీ, కంటెంట్, విభిన్నమైన కథలు, రైటింగ్ పరంగా ఇంకా వెనకబడే ఉందనేది మరో వాదన. మరి కమర్షియల్ గా సక్సెస్ అవుతున్నా.. కథాకథనాల పరంగా ఎందుకు టాలీవుడ్ వెనకబడింది? అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.