నవ్వు నాలుగు రకాలుగా చేటు అంటారు కొందరు.. మరికొందరు నవ్వుతూ బతకాలిరా అంటారు. ఇక కష్టాల్లో ఉన్న వారికి చిరునవ్వుకు మించిన మెడిసిన్ ఇంకోటి లేదంటారు ఇంకోందరు. ఎవ్వరు ఏం చేప్పినా గానీ.. ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఓ చిన్న కామెడీ బిట్ చూస్తే చాలు.. వెంటనే కడుపుబ్బా నవ్వి మన బాధలు అన్ని మర్చిపోతాం. ఇక టాలీవుడ్ లో కామెడీ అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక్క ముఖచిత్రం హాస్య బ్రహ్మ ‘బ్రహ్మానందం’. కొన్ని దశబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు బ్రహ్మానందం. టాలీవుడ్ లోకి ఎందరో కమెడియన్లు వచ్చారు.. పోయారు.. కానీ సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు వారితో నటించి రికార్డులు సృష్టించాడు. ఇక బ్రహ్మానందంతో పాటుగా.. ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, బాబూమోహన్, గుండు హనుమంతురావు, వేణు మాధవ్, సునీల్, అలీ లాంటి మరెందరో టాప్ మోస్ట్ హస్యనటులు ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేశారు. కానీ వీరందరిలో బ్రహ్మానందాన్ని మాత్రం ఎవ్వరూ దాటలేకపోయారు ఎందుకు? జంధ్యాల లాంటి రచయితలు లేకపోవడమా? లేక ఇప్పుడు ఉన్న డైరెక్టర్లకు, రైటర్లకు కమెడియన్లను ఎలా వాడుకోవాలో తెలియడం లేదా?
బ్రహ్మానందం-జంధ్యాల.. ఈ పేర్లు వింటే చాలు మనసు వెంటనే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల మీదికి వెళ్తుంది. ఓరే అరగుండు నాయాలా అని కోటా శ్రీనివాస్ తో చెప్పించిన డైలాగులకు బ్రహ్మి ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ చూస్తే చాలు మనకు నవ్వాగదు. ‘అహ నా పెళ్లంట’ సినిమాలో బ్రహ్మి చేసిన కామెడి ఇప్పటికీ.. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఆ సినిమా టీవీల్లో వస్తే ఇప్పటికీ కళ్లు అప్పగించి చూసే హస్య ప్రియులు ఎంతో మంది. కాలం గడిచే కొద్ది కామెడిలో కూడ మర్పు వస్తూనే ఉంది. కానీ బ్రహ్మానందం హాస్యంలో మాత్రం ఏ మార్పు రాలేదు. పైగా అతడి కామెడి టైమింగ్ పెరుగుతూనే వచ్చింది తప్ప ఎక్కడా తగ్గలేదు. ఇక బ్రహ్మానందం కెరీర్ పీక్స్ లో ఉన్న కాలంలో ఆయనతో పాటుగా బాబూమోహన్, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, అలీ, సునీల్, వేణుమాధవ్ లాంటి ఎంతో మంది హాస్య నటులు వెండితెరపై తమదైన ముద్రవేశారు.
కానీ అగ్రస్థానంలో ఉన్నది మాత్రం బ్రహ్మానందమనే చెప్పాలి. దాదాపు 1200 సినిమాల్లో హస్యనటుడిగా నవ్వించి మెప్పించారు. మధ్యలో కొన్ని సినిమాల్లో హీరోగా కూడా మెరిశారు బ్రహ్మానందం. బ్రహ్మానందం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే.. ప్రస్తుతం ఎంతో మంది మీమర్స్, ట్రోలర్స్ కు అన్నం పెడుతుంది ఆయనే. బ్రహ్మీ మీమ్, ట్రోల్స్ లేకుండా ఏ పోస్ట్, ఏ వీడియో కూడా ఉండదు. ఇక హాస్య ప్రపంచానికి మహారాజుగా వెలుగొందిన ఆయన.. గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరపై కనిపించడం తగ్గించేశారు. అయితే ఆయన తదనంతరం ఆ కామెడి అగ్రస్థానాన్ని ఎవ్వరూ కూడా భర్తీ చేయలేకపోయారు. ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, అలీ, సునీల్ లాంటి మరికొందరు ఉన్నప్పటికీ బ్రహ్మానందం స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేకపోయారు. అలా అని వారి కామెడిని తక్కువ చేసి చెప్పడం లేదు.
అయితే మళ్లీ బ్రహ్మానందం లాంటి హాస్య నటులు రాకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. జంధ్యాల, ఈవీవీ సత్యనారయణ, ఆదుర్తి సుబ్బారావు లాంటి రైటింగ్, డైరెక్టింగ్ స్కిల్స్ ఇప్పటి దర్శకుల్లో ఎక్కువగా కనిపించకపోవడం కూడా బ్రహ్మీ లాంటి కమెడియన్ మళ్లీ రాకపోవడానికి కారణంగా నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రైటర్లు.. ఇప్పుడున్న కమెడీయన్లకు తగ్గట్లుగా రాయకపోవడం కూడా ఇందుకు కారణంగా వారు చెప్పుకొస్తున్నారు. ఇక వర్ధమాన హాస్య నటులు అయిన వెన్నెల కిశోర్, సప్తగిరి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి మరికొందరు కమెడియన్లు సినిమాల్లో తమ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నప్పటికీ.. బ్రహ్మీ స్థానాన్ని మాత్రం ఎవ్వరూ భర్తీ చేయలేకపోతున్నారని హాస్య ప్రియులు వాపోతున్నారు.
ప్రస్తుతం సినిమాల్లో కనిపిస్తున్న కామెడి మెుత్తం జబర్దస్త్ స్కిట్స్ లా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గతంలో ఇలా లేదు.. జంధ్యాల నుంచి నిన్న మెున్నటి శ్రీను వైట్ల వరకు హెల్దీ కామెడీని ప్రేక్షకులకు అందించారు. కానీ ఇప్పుడు కామెడీని సీన్లలో బలవంతగా ఇరికించినట్లుగా పెడుతున్నారు అని సగటు సినీ ప్రేక్షకుడి వాదన. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు అని ముందుకెళ్లే క్రమంలో సంప్రదాయకమైన హాస్యాన్ని డైరెక్టర్లు మర్చిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు బ్రహ్మానందం స్థానాన్ని భర్తీ చేసే హాస్య నటుడు రాలేదనే చెప్పాలి.