సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సినిమాలు తీయాలని ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. పెద్దగా అనుభవం లేకపోయినా.. తీసింది ఒకటి రెండు సినిమాలే అయినా.. కాన్సెప్ట్, కథ నచ్చితే యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నారు స్టార్ హీరోలు. అయితే.. స్టార్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు సీనియర్ దర్శకులే మొదటి సినిమాలా భావించి, పక్కా ప్రణాళికతో ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. మంచి హిట్స్ అందుకుంటున్నారు.
మరి అగ్రదర్శకులే పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు కథలు, స్క్రీన్ ప్లే, లాజిక్స్ పరంగా అంత కేర్ తీసుకుంటుంటే.. యంగ్ డైరెక్టర్స్ ఇంకెంత జాగ్రత్తపడాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదంతా రివర్స్ లో జరుగుతోంది. స్టార్ హీరోలు అవకాశం ఇచ్చినా యంగ్ డైరెక్టర్స్ హిట్టు కొట్టలేకపోతున్నారు. అందులోనూ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోతో సినిమా అంటే పూర్తిగా బోల్తా పడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ లాంటి హీరోతో యంగ్ డైరెక్టర్స్ సినిమాలు తీసి మెప్పించలేకపోయారు.పాన్ ఇండియా స్టార్ లతో సినిమాలు చేయాలని ప్లాన్ చేసి, కథ- స్క్రిప్ట్ పరంగా మెప్పించి.. ఎందుకని ప్రోడక్ట్ ని సరిగ్గా డెలివరీ చేయలేకపోతున్నారు? పాన్ ఇండియా క్రేజ్ ఉందికదా కలెక్షన్స్ అవే వస్తాయిలే అని లైట్ తీసుకుంటున్నారా? ఆ విధంగా చూసుకుంటే.. మరి తమిళంలో యంగ్ డైరెక్టర్స్ అందరూ స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ హిట్స్ అందుకుంటున్నారు. మరి వాళ్లేందుకు సక్సెస్ అవుతున్నారు? తెలుగు డైరెక్టర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అనేది ఫ్యాన్స్ లో, ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ స్టార్ డైరెక్టర్స్ వైపు చూడకుండా.. యంగ్ డైరెక్టర్స్ సుజిత్, రాధాకృష్ణకుమార్ లకు అవకాశం ఇచ్చాడు. ఒకరు సాహోతో ప్లాప్ ఇస్తే, మరొకరు రాధేశ్యామ్ తో అట్టర్ ప్లాప్ తీశారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ తీసి మెప్పించలేకపోయాడు దర్శకుడు సాగర్ కే చంద్ర. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తో తెలుగు యువదర్శకుడు గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ’ రీమేక్ చేసి ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ విధంగా చూస్తే.. తెలుగులో పెద్ద హీరోలతో సినిమాలు తీసి నిరాశపరిచిన యువ దర్శకులు లిస్ట్ పెద్దగానే ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.మరోవైపు తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో చూసుకుంటే.. చిన్న సినిమాలో పెద్ద సినిమాలో తెరకెక్కించి మంచి హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పుడు అవే సినిమాలను కొందరు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. తమిళంలో యంగ్ డైరెక్టర్స్ అంతా స్టార్ హీరోలతో సినిమాలు తీసి చెలరేగిపోతున్నారు. ఉదాహరణకు డైరెక్టర్ అట్లీ, లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, మారి సెల్వరాజ్, వెట్రిమారన్, కార్తీక్ సుబ్బరాజ్, అశ్విన్ శరవణన్, బాలాజీ తరణీతరన్ ఇలా పెద్ద లిస్టే ఉంది.
వీళ్లందరితో సినిమాలు చేసేందుకు తమిళ స్టార్స్ అంతా ఉత్సాహం కనబరుస్తున్నారు. కానీ తెలుగు స్టార్ హీరోలు తెలుగు యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసేందుకు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలు సైతం తమిళ దర్శకులతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లోకేష్ కనగరాజ్, వెట్రిమారన్ లతో సినిమాలు చేయాలని ఉందంటూ చెప్పారు.మరి స్టార్స్ తో సినిమాలు చేస్తూ తమిళ యువదర్శకులు ఎలా హిట్స్ కొడుతున్నారు. తెలుగులో ఫస్ట్ సినిమాలకే భారీ బడ్జెట్స్ పెట్టిస్తూ యంగ్ డైరెక్టర్స్ ఎందుకు మెప్పించలేకపోతున్నారు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేస్తే.. కొత్త కథలు బయటికి వస్తాయని.. ప్రేక్షకులకు కొత్తదనం దొరుకుతుందనే ఆలోచనలో యువ దర్శకుల స్క్రిప్టులను ఓకే చేస్తున్నారు. మరి వారు చెప్పిన కథలనే.. తెరపై ప్రెజెంట్ చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నారు తెలుగు దర్శకులు? ఎందులో లోపం జరుగుతోంది? స్క్రిప్ట్ నమ్మి గుడ్డిగా వెళ్తున్నారా? మేకింగ్ ప్రాసెస్ లో మిస్టేక్స్ కనిపెట్టలేక పోతున్నారా? ఎడిటింగ్ దగ్గర సీన్స్ మిస్ అవుతున్నారా?.. ఇలా స్టార్ హీరోల ఫ్యాన్స్ లో ఎన్నో సందేహాలు. మరి వీటన్నింటికీ టాలీవుడ్ లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ త్వరలో తమ సినిమాలతో సమాధానం చెబుతారేమో చూడాలి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.