తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య-బోయపాటి శీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులు సంబరపడిపోతారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాయి. తాజాగా బాలయ్య-బోయపాటి శీను కాంబినేషన్ ‘అఖండ’ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఎక్కడ చూసిన బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. సినిమా థియేటర్ల దగ్గర ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల సందడితో రోజు సందడి నెలకొంటోంది.
ఇక అఖండ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ ఇచ్చిన మ్యూజిక్ సెన్సేషన్ సృష్టిస్తుంది. కొన్ని సీన్లలో బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ దిమ్మతిరిగిపోతుందని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో మంటలు చెలరేగాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారే భయంతో పరుగులు తీశారు. శ్రీకాకుళంలోని రవిశంకర్ సినిమా థియేటర్‌లో ఈ ఘటన జరిగింది.
థియేటర్ లో అఖండ ఫస్ట్ షో ప్రారంభమైంది. కాసేపకే స్క్రీన్ వెనుకున్న సౌండ్ సిస్టంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అనుకోని ఘటనతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. థియేటర్ బయటకు పరుగులు పెట్టారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ యాజమాన్యం, సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బోయపాటి మాస్ టేకింగ్, బాలకృష్ణ యాక్షన్, తమన్ మ్యూజిక్.. అన్నీ కలిపి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని బాలయ్య అభిమానులు అంటున్నారు.