కారు కొనుగోలు చేయాలని ఎన్నో కలలు కంటారు. ఆ కల నెరవేరిన తర్వాత ఇంక రిలాక్స్ అయిపోతారు. ఆ కారు కండిషన్, లైఫ్ గురించి అసలు పట్టించుకోరు. అయితే కారు కొన్నాక ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కారుకు సంబంధించి అన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. అందులో భాగంగా టైర్లకు సాధారణ గాలి మంచిదా? నైట్రోజన్ ఫిల్ చేస్తే మంచిదా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి.
చాలా మంది కార్లు కొంటారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రం వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. మీరు కారు కొన్న తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలను, జాగ్రత్తలను తెలుసుకోవాలి. వాటిలో ముఖ్యంగా వాహనం ఏదైనా టైర్లు గురించి బాగా తెలుసుకోవాలి. ఎండాకాలంలో అయితే కారు టైర్ల విషయంలో అజాగ్ర్తతగా ఉంటే ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాలపై సెర్చ్ చేసే క్రమంలో చాలామందిలో ఇప్పటికీ ఉన్న ప్రశ్న.. టైరులో సాధారణ గాలి ఫిల్ చేయించాలా? నైట్రోజన్ ఫిల్ చేయించాలా? నిజంగానే టైర్లలో నైట్రోజన్ ఫిల్ చేయిస్తే మైలేజ్ బాగా వస్తుందా? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
మైలేజ్ విషయంలో కారు టైర్లు కీలకపాత్ర పోషిస్తాయి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. మీ కారు టైర్లలో సరైన ప్రెజర్ లేకుండా ఉంటే కచ్చితంగా మైలేజ్ తగ్గిపోతుంది. ఒక్కసారిగా మీ కారు మైలేజ్ తగ్గితే మీరు చెక్ చేయాల్సింది టైర్లలో ఎయిర్ ప్రెజర్. సరైన పరిమితిలో గాలి లేకపోతే మైలేజ్ తగ్గడమే కాకుండా.. వీల్ అలైన్ మెంట్ కూడా దెబ్బతింటుంది. కారులో ఎయిర్ ప్రెజర్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే నైట్రోజన్ విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అయితే అది తెలియాలి అంటే ముందుగా గాలికి నైట్రోజన్ కి ఉండే తేడా తెలుసుకోవాలి.
సాధారణంగా మొదటి నుంచి అందరూ నార్మల్ ఎయిర్ నే ఫిల్ చేయిస్తుంటారు. కానీ, కొన్నాళ్ల నుంచి నైట్రోజన్ గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. సాధారణ గాలి చాలా తేలిగ్గా లభిస్తుంది. నైట్రోజన్ మాత్రం అన్ని చోట్ల దొరకదు. పైగా కంప్రెస్డ్ ఎయిర్ చాలా తక్కువకే లభిస్తుంది. పెట్రోల్ బంకుల్లో అయితే ఫ్రీగానే కంప్రెస్డ్ ఎయిర్ ఫ్రీగానే రీఫిల్ చేసుకోవచ్చు. మరోవైపు నైట్రోజన్ రీ ఫిల్లింగ్ అంత తేలికకాదు. అన్నిచోట్ల మీకు నైట్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ దొరకవు. మెట్రో పాలిటన్ సిటీల్లోనే మీకు అన్నిచోట్ల నైట్రోజన్ లభించదు. పైగా దీని రీఫిల్లింగ్ కి ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే నైట్రోజన్ నింపడం వల్ల కచ్చితంగా మైలేజ్ పెరుగుతుందా అంటే? ప్రాక్టిగల్ గా ఎవరూ నిరూపించింది లేదు.
నైట్రోజన్ వల్ల ప్రయోజనాలు ఉన్న మాట వాస్తవమే. మీరు కారు టైర్లలో నైట్రోజన్ ఫిల్ చేయిస్తే.. వాటి లైఫ్ పెరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం సమయంలో టైర్లలో నైట్రోజన్ ఉండటం వల్ల పీడనం తక్కువగా ఉంటుంది. తక్కువ ప్రెజర్ వల్ల టైర్ లైఫ్ పెరగడమే కాదు.. పేలిపోయే ప్రమాదాలు కూడా తప్పుతాయి. నైట్రోజన్ మాలిక్యూల్స్ పరిమాణంలో గాలి మాలిక్యూల్స్ కంటే పెద్దగా ఉంటాయి. దాని వల్ల లీకయ్యే ఆస్కారం తక్కువగా ఉంటుంది. కంప్రెస్డ్ గాలితో పోల్చుకుంటే నైట్రోజన్ నింపిన టైర్లు కాస్త కూల్ గా ఉంటాయి. కానీ, నైట్రోజన్- గాలిని కలిపి మాత్రం టైర్లలో ఫిల్ చేసేందుకు వీలుకాదు. కాబట్టి మీ ఆర్థిక స్తోమత, నైట్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్స్ అవైలబిలిటీని బట్టి మీరు కంప్రెస్డ్ ఎయిర్ ఫిల్ చేయించుకుంటారా? నైట్రోజన్ ఫిల్ చేయించుకుంటారా? అనేది నిర్ణయించుకోవాలి. కేవలం మైలేజ్ వస్తుంది అనే ప్రచారాలతో మాత్రం నైట్రోజన్ ఫిల్ చేయించుకోకండి.