‘‘సోషల్ మీడియాలో కొంత మంది బ్యాచ్ తయారై నా మీద నెగిటివ్ ప్రచారం చేస్తూ తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ట్రోల్ చేసినా భయపడేది లేదు’’ అంటూ కిరణ్ గట్టిగా సమాధానం ఇచ్చారు.
సినిమా ప్రపంచం అన్నది ఓ జూదం లాంటిది. ఎక్కువగా అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అవకాశాలు రావటం ఎంత ముఖ్యమో.. వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవటం కూడా అంతే ముఖ్యం. హీరోలు, హీరోయిన్ల సినిమా జీవితం మొత్తం కథల ఎంపిక మీదే ఆధారపడి ఉంటుంది. కథలో కొత్త ధనం.. ప్రేక్షకులను ఆకట్టుకునే ఎలిమెంటు లేకపోతే ఎన్ని సినిమాలు చేసినా లాభం ఉండదు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం విషయంలోనూ ఇదే జరుగుతోంది. మంచి టాలెంట్, సినిమాల మీద ప్యాషన్ ఉన్న కిరణ్ అబ్బవరం హిట్లు అందుకోలేక.. సరైన ఎదుగుదల లేక ఇబ్బందిపడుతున్నారు. అసలు సంగతి గుర్తించని ఆయన.. తనను కావాలనే తప్పుడు ప్రచారాలతో తొక్కేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న హీరో అయినప్పటికి పెద్ద పెద్ద కంపెనీల్లో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. 2019లో ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. ‘‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ సినిమాతో సూపర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తర్వాతి సినిమాల్లో కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆయన సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావటం మొదలైంది.
అయితే, ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ తర్వాత వచ్చిన సెబాస్టియన్ పీసీ 524తో పాటు పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే.. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా విడుదల సందర్భంగా కిరణ్ అబ్బవరం సంచలన కామెంట్లు చేశారు. తనను సోషల్ మీడియా వేదికగా కొంతమంది టార్గెట్ చేసి తొక్కేస్తున్నారని, అలాంటి వారికి భయపడేది లేదని అన్నారు. కిరణ్ అబ్బవరంపై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్స్ జరుగుతున్న సంగతి వాస్తవమే..కానీ, ఈ ట్రోలింగ్స్ కారణంగా అతడి సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని అనటం తగదని సినిమా విశ్లేషకుల అభిప్రాయం.
కిరణ్ అబ్బరం నటన పరంగా.. సినిమాల మీద అతడికి ఉన్న ప్యాషన్ పరంగా ఎలాంటి పేరు పెట్టడానికి లేదు. ఎంతో కమిట్‌మెంట్‌తో.. కష్టంతో మొదటి నుంచి సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రతీ సినిమాకు మధ్య వేరియేషన్స్ చూపించటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, కథల ఎంపిక విషయంలో మాత్రం కిరణ్ దృష్టి పెట్టడం లేదు. సినిమా ఎంత కష్ట పడి చేసినా.. అల్టిమేట్‌గా తెరమీద కనపడేదానికే వాల్యూ ఉంటుంది. కథలో పస లేనప్పుడు ప్లాప్ అవ్వటం జరుగుతుంది. కిరణ్ అబ్బవరం కథల ఎంపికలో ఫెయిల్ అవుతున్నారు. మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోతున్నారు. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అన్న దానికంటే.. మంచి కథ ఉందా లేదా అన్నదానికే ప్రేక్షకులు ప్రామూఖ్యత ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో కిరణ్ అబ్బవరం కథల మీద దృష్టి పెడితే అనుకున్న విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాడు.