ఇండస్ట్రీలో నన్ననెవరూ లేపలేదు… నన్ను నేనే లేపుకున్నా అనే విశ్వక్‌సేన్ ఇప్పుడు అభిమానులు, నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. విశ్వక్‌సేన్ రీసెంట్‌గా నటించిన చిత్రం ‘పాగల్’. దిల్‌రాజు సమర్పణలో వేణుగోపాల్ నిర్మించిన పాగల్ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. విశ్వక్ ప్రమోషన్లతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లకు వచ్చిన అభిమానులు ‘పాగల్’పై ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
అభిమానుల దాడిపై విశ్వక్‌సేన్ స్పందించాడు. ‘నేను మీ విశ్వక్ సేన్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. ‘పాగల్’ సినిమాను ఆదరిస్తారనీ.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబెడతారని కోరుకుంటున్నాను. మా ప్రయత్నంలో మీకు ఏదైనా చిన్నలోపం అనిపిస్తే.. విమర్శించండి. కానీ, దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి.. ఉన్నా లేకపోయినా.. ఎన్నో వేలమందికి ఉపాధికి కలిగించే.. సినిమా థియేటర్లను కాపాడండి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు మీరే అండ.. దండ..’ అని భావోద్వేగంగా విశ్వక్ స్పందించాడు.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సినిమా గురించి మాట్లాడుతూ, కరోనాతో మూతపడ్డ థియేటర్లను ‘పాగల్’ సినిమాతో తెరిపిస్తా. అమ్మతోడు ‘పాగల్’ సినిమాతో మళ్లీ థియేటర్లు తెరుచుకుంటాయి. సినిమా హిట్ కాకపోతే పేరు మార్చుకుంటా అని విశ్వక్ చేసిన వ్యఖ్యలు అందరికీ తెలిసిందే. తర్వాత ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ వాటిని వెనక్కి తీసుకోను అని కూడా సమాధానమిచ్చాడు విశ్వక్. సినిమా చూసి థియేటర్ల నుంచి వస్తున్న అభిమానులు ‘విశ్వక్ పేరు మార్చుకో’ అంటూ విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అభిమానుల ట్రోలింగ్ శ్రుతి మించుతున్న తరుణంలో విశ్వక్‌సేన్ స్పందించాడు. మరి, ఇప్పటికైనా ట్రోలింగ్ ఆపుతారా? లేదా? అన్నది చూడాలి.