హీరో విశ్వక్ సేన్- డైరెక్టర్ కమ్ యాక్టర్ అర్జున్ మధ్య గొడవ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టిన డైరెక్టర్ అర్జున్.. హీరో విశ్వక్ సేన్ పై ఆరోపణలు చేశాడు. అతడి వల్ల తనకు, తన మూవీ యూనిట్ కి అవమానం జరిగిందని చెప్పాడు. ఉదయం 4 గంటలకు మెసేజ్ పెట్టిన హీరో విశ్వక్ సేన్.. షూటింగ్ కి రావట్లేదని చెప్పాడని అన్నాడు. షూటింగ్ టైంలోనూ విశ్వక్ తనని ఇబ్బంది పెట్టాడని అన్నాడు. తాజాగా ఈ మొత్తం విషయంపై హీరో విశ్వక్ సేన్ స్పందించాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మూడు నెలల క్రితం అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, విశ్వక్ సేన్ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా మొదలైంది. అర్జున్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఓపెనింగ్ కి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ తర్వాత షూటింగ్ కూడా చేశారు. ఏమైందో ఏమో తెలీదు గానీ సడన్ గా ప్రెస్ మీట్ పెట్టిన అర్జున్.. హీరో విశ్వక్ సేన్ బిహేవియర్ గురించి బయటపెట్టాడు. ఇక అతడితో సినిమా చేయట్లేదని చెప్పాడు. ఆదివారం జరిగిన ‘రాజయోగం’ టీజర్ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా హాజరైన విశ్వక్ సేన్.. అర్జున్-తనకు మధ్య ఇష్యూ గురించి మొత్తం ఓపెన్ అయిపోయాడు.
‘నటుడ్ని అయ్యేందుకు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అవమానాలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు బాగా ఉన్నాడు కదా అని ఎవరూ వాటి గురించి మాట్లడరు. కానీ నటులుగా మేం వాటినే మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని. ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని నేను సినిమాలు చేయను. ప్రేమతో చేస్తుంటా. సినిమాకు సంబంధించిన అన్ని పనులు చూసుకుంటాను. నా అంత కమిటెడ్, ప్రొఫెషనల్ నటుడు ఉండడు. ఈ ఏడాది నేను మూడు సినిమాలు చేశాను. నా వల్ల ఇప్పటివరకు ఏ నిర్మాత బాధపడలేదు. ఒక్క రూపాయి నష్టపోలేదు. భయపడే చిన్న ప్రొడ్యూసర్స్ తో నేను పనిచేయలేదు. నేను చేసినవి చిన్న చిత్రాలే అయినా ప్రొడ్యూస్ చేసింది పెద్ద నిర్మాతలు’ అని విశ్వక్ సేన్ చెప్పాడు.
‘నా సినిమాల సెట్ లోని ఒక్క లైట్ బాయ్ అయినా.. నన్ను కమిటెడ్, ప్రొఫెషనల్ యాక్టర్ కాదంటే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. నేను ఫలానా మార్పు చేస్తే బాగుంటుంది సర్ అని చెబితే నువ్వు వదిలేయ్, నన్ను నమ్ము అని ఏది చెప్పనిచ్చే వారు కాదు. నన్ను కట్టిపడేసేవారు. కళ్లు మూసుకుని కాపురం చేయ్ అన్నట్టుంది వ్యవహారం. అయినా చేసేద్దామనిపించి, లుక్ టెస్టు కూడా పూర్తిచేశాను. తర్వాతి రోజు లేచి, షూట్ కి బయలుదేరే ముందు ఎందుకో భయమేసింది. మాట్లాడుదాం అని అర్జున్ సర్ కి మెసేజ్ చేశాను. దీంతో వాళ్ల మేనేజర్ నుంచి ఇంకేంటి మాట్లాడేది అని అకౌంట్ వివరాలు పంపించారు. సినిమా నుంచి బయటకొస్తానని నేను చెప్పలేదు. సినిమాల విషయంలో తప్పు చేశానంటే చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను’ అని విశ్వక్ సేన్, అర్జున్ ని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ గొడవ ఇంకా ఎటువైపు వెళ్తుందో చూడాలి.