యువ హీరో విశ్వక్ సేన్ సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విశ్వక్.
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్‌కు ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా యూత్ ఆడియెన్స్‌లో విశ్వక్‌కు మంచి పాపులారిటీ ఉంది. తన యాటిట్యూడ్, యాక్టింగ్‌తో ఎంతోమంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. విశ్వక్ సినిమాల్లోని డైలాగ్స్ యువ ప్రేక్షకుల్లో ఆయన ఇమేజ్ను మరింతగా పెంచాయి. మంచి ఇంటెన్సిటీ ఉన్న రోల్స్‌లో నటిస్తూ తన ఇమేజ్ను పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు విశ్వక్. ఒకవైపు నటిస్తూనే మరోవైపు మెగాఫోన్ కూడా చేపట్టి స్టార్ట్, కెమెరా, యాక్షన్ అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ‘ఫలక్‌నుమా దాస్’ అనే హిట్ సినిమా తీసిన విశ్వక్.. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా నటిస్తూ ఆయన ఈ మూవీని తెరకెక్కించడం విశేషం.
స్టార్ హీరోయిన్ నివేతా పేతురాజ్ హీరోయిన్గా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ విడుదలకు సిద్ధమైంది. మార్చి 22న థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కానుందీ చిత్రం. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ అటెన్షన్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యాయి. భారీ ఎత్తున రిలీజ్ కానున్న ‘దాస్ కా ధమ్కీ’ ఎంతపెద్ద హిట్టవుతుందో చూడాలి. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విశ్వక్ సేన్. మరో హీరో, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా వెంకన్నను దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీళ్లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.