ప్రముఖ హీరో విశాల్ కు హైకోర్టు షాకిచ్చింది. ఓ కేసు విషయమై రూ.15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాల్సిందేనని ఆదేశించింది. అప్పటివరకు విశాల్ చిత్రాలపై నిషేధం కూడా విధించింది.
పేరుకే తమిళ హీరో గానీ తెలుగులోనూ చాలా గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో విశాల్ ఒకడు. చివరగా ‘లాఠీ’తో ప్రేక్షకుల్ని పలకరించిన అతడు.. పలు సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. అలాంటి విశాల్ కు ఇప్పుడు మద్రాస్ హైకోర్ట్ షాకిచ్చింది. తను చేస్తున్న చిత్రాల్ని రిలీజ్ చేయాలంటే రూ.15 కోట్లు కట్టాల్సిందేనని ఆర్డర్ వేసింది. లేదంటే అప్పటివరకు సినిమాలని నిషేధిస్తామని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ విశాల్ సినిమాల విషయంలో ఏం జరిగింది?
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరో విశాల్ గతంలో తన నిర్మాణ సంస్థ కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియల్ అన్బుచెళియన్ దగ్గర రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని చెల్లించిన లైకా సంస్థ.. రుణం చెల్లించేంత వరకు విశాల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తమకే ఇచ్చేలా విశాల్ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని బ్రేక్ చేసిన విశాల్.. తన మూవీ ‘వీరమే వాగై సూడుం’ రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే లైకా సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ స్పెషల్ కోర్టు.. రిజిస్ట్రర్ పేరుతో మూడు వారాల్లో రూ.15 కోట్లు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని విశాల్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన విశాల్.. లైకా సంస్థ వల్లే తాను రుణం చెల్లించలేకపోయానని విన్నవించాడు. ఒకేరోజు రూ.18 కోట్లు నష్టం వచ్చిందని పేర్కొన్నాడు. దీంతో విశాల్ ఆస్తులు వివరాల్ని ప్రమాణ పత్రంలో సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై విశాల్ హైకోర్టులో అప్పీలు చేయగా, విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత్ చక్రవర్తిల ధర్మాసనం.. రూ.15 కోట్లు చెల్లించాలంటూ గతంలో ఇచ్చిన కోర్టు తీర్పుని సమర్థించింది. ఫైనల్ జడ్జిమెంట్ వెలువడే వరకు విశాల్ నిర్మాణ సంస్థ నుంచి కొత్త చిత్రాలు థియేటర్, ఓటీటీలో రిలీజ్ చేయడానికి వీల్లేదని ఆదేశించింది. ప్రస్తుతం ఈ వివాదం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి విశాల్ సినిమాల్ని కోర్టు నిషేధించడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.