అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు.. అలానే మనం విజయం సాధించడానికి కూడా ఒక్క అవకాశం రావాలి. అది వచ్చే వరకు సహనంతో వేచి చూడాలి. ఆ తర్వాత లభించే విజయం ఎంతో మధురంగా ఉంటుంది. ప్రస్తుతం నటుడు రవి కృష్ణ ఇలానే ఫీలవుతున్నాడు. విజయం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాడు. విరూపాక్షతో అది దక్కింది. మరి ఈ సినిమాకు ముందు రవికృష్ణ ఎదుర్కొన్న ఆటుపోట్లు ఏంటి అంటే..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం విరూపాక్ష. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. విరూపాక్ష థియేటర్‌లో విడుదలైన తర్వాత మొదటి రోజే పాటిజివ్ టాక్‌తో దూసుకుపోతోంది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాక.. భారీ వసూళ్లను సాధిస్తోంది. సాధారణంగా ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో ఏవో కొన్ని మాత్రమే ముఖ్య పాత్రలు ఉంటాయి. కానీ విరూపాక్షలో మాత్రం.. తెర మీద కనిపించే ప్రతి పాత్ర సినిమాలో కీలకంగా నిలిచింది. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్‌ల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాత్ర రవి కృష్ణది. సినిమా ప్రారంభంలో అమాయకంగా కనిపించిన రవికృష్ణ.. ఆ తర్వాత కీలక పాత్రగా మారిపోతాడు. తాంత్రిక విద్య అభ్యసించే వ్యక్తిగా, సిన్సీయర్ లవర్ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. ఇక తాంత్రిక విద్యను ప్రయోగించే సమయంలో రవి కృష్ణ నటన పీక్స్ అని చెప్పవచ్చు. విరూపాక్ష సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి.. అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు రవి కృష్ణ. విరూపాక్ష విజయం తర్వాత రవికృష్ణ టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్ అవుతాడని అందరూ నమ్ముతున్నారు.
అయితే విరూపాక్ష విజయం రవి కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పవచ్చు. మరి విరూపాక్ష ముందు వరకు రవికృష్ణ పరిస్థితి ఏంటి.. తన కెరీర్ ఎలా సాగింది అంటే.. ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదని చెప్పవచ్చు. బిగ్ బాస్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత అతడి కెరీర్ ఊపందుకుంటుందని అందరూ భావించారు.. కానీ గత మూడేళ్లుగా అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఇదే కాదు కెరీర్ ప్రారంభం నుంచే రవికృష్ణ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్ ఎలా ప్రారంభం అయ్యింది.. చిత్ర పరిశ్రమ వైపు ఎలా వచ్చాడు అంటే..
రవికృష్ణ స్వస్థలం విజయవాడ. తండ్రి ఆర్టీసీ ఉద్యోగి. తల్లి గృహిణి. డిగ్రీ వరకు విజయవాడలోనే చదివాడు రవి కృష్ణ. సినిమాల మీద ఆసక్తితో చెన్నై వెళ్లి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాడు. మంచి హైట్, ఎత్తుకు తగ్గ శరీర సౌష్టవంతో చూడగానే ఆకట్టుకునే రూపంతో.. సినిమాలకు సెట్ అయ్యే బాడీ రవికృష్ణది. కానీ వీటితో పాటు అదృష్టం కూడా ఉండాలంటారు కదా. రవికృష్ణ విషయంలో ఇది నిజం అయ్యింది. అదృష్టం తలుపు తట్టే వరకు ఓపికగా ఎదురు చూశాడు. ఆ తర్వాత విజేత/విజయం సీరియల్‌తో తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు అనే సీరియల్‌లో హీరో రీప్లేస్‌మెంట్‌లో భాగంగా.. రవికృష్ణను ఆ స్థానంలో తీసుకున్నారు. ఆ తర్వాత టెలివిజన్ చరిత్రలో సంచలనం సృష్టించిన మొగలి రేకులు సీరియల్ రవి కృష్ణ కెరీర్‌ను మలుపు తిప్పింది.
ఆ తర్వాత రవికృష్ణ హీరోగా హృదయం అనే సీరియల్ వచ్చింది. ఆ తర్వాత కొన్ని తెలుగు సీరియల్స్‌లో నటించాడు. కానీ అవేవి ఆశించిన మేర విజయం సాధించలేదు. ఈ క్రమంలో వరూధిని పరిణయం సీరియల్ రవికృష్ణ కెరీర్‌కు బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత మరికొన్ని సీరియల్స్‌లో యాక్ట్ చేశాడు. బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా వెళ్లాడు. అయితే ఇవేవి రవికృష్ణకు తాను కోరుకున్న గుర్తింపు ఇవ్వలేదు. ఇక ఆయన నటించిన చాలా సీరియల్స్ మధ్యలోనే ఆగిపోయాయి. బిగ్ బాస్ తర్వాత అవకాశాలు పెరుగుతాయి అనుకుంటే.. అందుకు రివర్స్‌లో జరిగింది. రవికృష్ణ కెరీర్ డైలమాలో పడింది.
తనలోని నటుడిని పూర్తి స్థాయిలో వెలికి తీసే పాత్ర అతడికి లభించలేదు.. అవకాశాలు కూడా తగ్గుతున్నాయి. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో.. విరూపాక్ష అవకాశం రవికృష్ణ తలుపు తట్టింది. నటనపై తనకున్న పిచ్చిని, ప్రేమను ఈ పాత్ర ద్వారా పూర్తి స్థాయిలో చూపించాడు రవి కృష్ణ. తన కెరీర్‌ను నిలబెట్టింది ఈ పాత్ర. ఇన్నాళ్లు తాను ఎలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్నాడో.. అది విరూపాక్ష ద్వారా లభించింది. సినిమాలో హీరో, హీరోయిన్ తర్వాత ఆ రేంజ్‌లో తన పాత్రకు గుర్తింపు రావడంతో.. రవి కృష్ణ సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు తాను ఎదుర్కొన్న అవమానాలు, బాధలు, కష్టాలకు విరూపాక్ష విజయంతో సమాధానం చెప్పాడు రవి కృష్ణ. ఇక ఇప్పటికైనా తన కెరీర్ సజావుగా సాగుతుందని.. మరిన్ని మంచి పాత్రల్లో నటిస్తాడని.. అభిమానులు ఆశపడుతున్నారు. మరి విరూపాక్ష సినిమాలో రవికృష్ణ పాత్ర మీకు ఎలా అనిపించింది.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.