మిగతా రోజులతో పోలిస్తే.. ఆదివారం రోజున మాల్స్, థియేటర్ వద్ద సందడి అధికంగా ఉంటుంది. తాజాగా ఆదివారం ఓ థియేటర్ వద్ద అడియెన్స్ రచ్చ చేశారు. పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది.
మెగా మేనల్లడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గతేడాది సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. దాంతో సినిమాలకకు ఏడాదికిపైగా గ్యాప్ వచ్చింది. ఇక యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. తొలిరోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించింది. భారీ కలెక్షన్లు సాధించే దిశగా పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో విరూపాక్ష సినిమా ప్రదర్శితం అవుతోన్న ఓ థియేటర్ వద్ద ఆడియన్స్ రచ్చ రచ్చ చేసి థియేరట్‌పై దాడి చేశారు. ఆ వివరాలు..
ఆదివారం వీకెండ్, సెలవు కావడంతో.. జనాలు విరూపాక్ష సినిమా చూడటానికి పోటేత్తారు. ఈ క్రమంలో ఓ సినిమా థియేటర్‌పై ప్రేక్షకులు దాడి చేశారు. షో ఆలస్యంగా వేయడమే ఇందుకు కారణం. హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూసాపేటలోని ఏషియన్ లక్ష్మీకళ సినీ ప్రైడ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం ఫస్ట్(6 గంటలకు) షో కోసం టికెట్ కొని లోపలికి వెళ్లారు. ఏకంగా గంటన్నర సమయం గడిచినా కూడా సినిమా వేయకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. దాంతో థియేటర్ అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీని గురించి థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
టికెట్ కొన్న ప్రేక్షకుల డబ్బులు తిరిగి ఇచ్చింది థియేటర్ యాజమాన్యం. దాంతో శాంతించిన ప్రేక్షకులు సినిమా చూడకుండానే నిరుత్సాహంతో థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే, సినిమా ప్రదర్శన ఆలస్యం కావడానికి సంబంధించిన కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఇక విరూపాక్ష సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ విరూపాక్ష సినిమాను నిర్మించారు. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు.