Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. విజయేంద్రప్రసాద్ చేత ప్రమాణం చేయించారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన రాష్ట్రపతి కోటాలో విజయేంద్రప్రసాద్ రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక రాజ్యసభ సభ్యులుగా విజయేంద్రప్రసాద్ 2027 వరకు కొనసాగనున్నారు.
అగ్రస్థాయి సినీ రచయిత అయినటువంటి విజయేంద్రప్రసాద్.. పశ్చిమగోదావరి జిల్లా కోవ్వూరులో జన్మించారు. ఆయన కుటుంబంలో అందరికంటే చిన్నవాడు విజయేంద్ర ప్రసాద్. ఈయన సోదరుడు శివదత్తాకు మొదటినుండి కళలు, కవిత్వంపై ఆసక్తి ఉండేది. మద్రాస్ వెళ్లి చాలా సినిమాలకు స్క్రిప్టు రైటర్ గా పనిచేసినా సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత సోదరుడు శివదత్తాతో కలిసి విజయేంద్రప్రసాద్ కూడా కథలు రాయడం నేర్చుకున్నారు.
ఆ విధంగా బంగారు కుటుంబం సినిమాకు తన మొదటి కథను అందించారు విజయేంద్రప్రసాద్. ఆ తర్వాత బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, జానకి రాముడు, సమరసింహరెడ్డి, నా అల్లుడు సినిమాలతో పాటు తనయుడు రాజమౌళి దర్శకత్వం వహించిన రెండో సినిమా సింహాద్రి నుండి ఇటీవలి ఆర్ఆర్ఆర్ వరకూ కథలను అందించారు.
ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ‘బాహుబలి’ సినిమాకు, సల్మాన్ ఖాన్ హీరోగా బ్లాక్ బస్టర్ అయిన భజరంగి భాయిజాన్ సినిమాకు కూడా ఆయనే కథలు అందించారు. కేవలం తెలుగులోనే కాకుండా విజయేంద్రప్రసాద్.. కోలీవుడ్, బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలకు కథలు, స్క్రిప్టులు రాశారు. మరి తాజాగా విజయేంద్రప్రసాద్ రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.