చిత్ర పరిశ్రమకు, రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఇండస్ట్రీలో అగ్రకథానాయకులుగా ఎదిగిన తర్వాత రాజకీయ రంగప్రవేశం చేశారు కొందరు హీరోలు. వారిలో ముందువరుసలో ఉన్నవారు అలనాటి తమిళ అగ్ర కథానాయకుడు ఎంజీఆర్ ఒకరు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. మహానటుడు నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సంచలనాన్ని సృష్టించారు. ఈ క్రమంలోనే అగ్ర కథానాయకుల, ప్రముఖ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు సినిమాగా తెరకెక్కి సంచలనాలు సృష్టించిన సందర్బాలు చరిత్రలో అనేకం. ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి, ఇందిరా గాంధీ, వైఎస్ఆర్ లాంటి మహా నాయకుల జీవిత చరిత్రలు సినిమాలుగా వెండితెరపై అలరించాయి. ఈ నేపథ్యంలోనే మరో రాజకీయ కురువృద్ధుడు, మాజీ సీఎం జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కబోతుంది అన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అందులో హీరోగా తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నట్లు సమాచారం.
విజయ్ సేతుపతి.. అటు హీరోగా, ఇటు విలన్ గా తనదైన నటనతో అభిమానులను మెప్పిస్తున్నాడు. ఉప్పెన సినిమాతో విలన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. ఈ సినిమాలో సేతుపతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. హిట్ లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సేతుపతి సినిమాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దా రామయ్యపై బయోపిక్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సిద్దారామయ్య రోల్ లో విజయ్ సేతుపతి నటించనున్నట్లు తమిళ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇందుకు సంబంధించి ఇప్పటికే కథ సిద్దమైందని, సేతుపతిని సైతం మేకర్స్ సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే తన బయోపిక్ లో తాను నటించడం లేదని సిద్దారామయ్య తెలిపినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే సిద్దారామయ్య తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు తమ నాయకుడి జీవిత చరిత్రను వెండితెరపై చూడడానికి కార్యకర్తలు, మద్దతుదారులు ఎదురుచూస్తున్నారు. అయితే సిద్దారామయ్య బయోపిక్ లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నటుడు విజయ్ సేతుపతి ఎలాంటి ప్రకటనా చేయలేదు.