అభిమానులు ముద్దుగా మక్కల్ సెల్వన్ అని పిలుచుకునే స్టార్ నటుడు విజయ్ సేతుపతి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల గురించి తెలుసన్నారు. ఇంకా ఆయనేం అన్నారంటే..!
ప్రముఖ కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి గురించి తెలిసిందే. భాషలకు అతీతంగా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. మంచి అవకాశం దొరికితే ఎక్కడ నటించేందుకైనా ఆయన రెడీగా అంటారు. తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న సేతుపతి.. అడపాదడపా తెలుగు, హిందీల్లోనూ మెరుస్తున్నారు. అయితే ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తేనే ఇతర భాషల్లో నటించడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్నారు. అలా తెలుగులో ‘ఉప్పెన’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. హీరోయిన్ తండ్రిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగా నటించారు. అదే విధంగా హిందీలో ఈమధ్య విడుదలైన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌లోనూ తనదైన యాక్టింగ్‌తో అలరించారు.
వైవిధ్యమైన నటనతో ఆకట్టుకునే విజయ్ సేతుపతిని అభిమానులు మక్కల్ సెల్వన్ అని పిలుస్తుంటారు. అలాంటి ఆయన రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ బర్త్ డే సందర్భంగా చెన్నైలోని తేనాంపేటలో ‘స్టాలిన్ 70’ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. విజయ్ సేతుపతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి యువత పాలిటిక్స్ గురించి తెలుసుకోవాలని, తనకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం ఇప్పుడు లేదని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సేతుపతి పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.