సినీ తారలకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి ఒక హీరోకు సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సినిమాల్లో ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు. అవకాశం వస్తే తామేంటో నిరూపించుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ఒకవేళ మూవీ ఛాన్స్ వచ్చినా నిలదొక్కుకోవడం, పేరు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కష్టపడేతత్వం, నిరంతరం మెరుగు పడాలనే తపన ఉంటే తప్ప ఇక్కడ సక్సెస్ అవ్వలేరు. అందుకే చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చి వెళ్తుంటారు. ఒక్క సినిమాతో ఫేడ్ ఔట్ అయిన వాళ్లు ఎందరో ఉన్నారు. చిత్ర పరిశ్రమను అర్థం చేసుకుని, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తమను తాము మార్చుకునే వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. బయటి నుంచి వచ్చిన వారే కాదు.. వారసత్వంతో వచ్చిన వారికీ ఇది వర్తిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మిగతా అన్ని రంగాల్లానే సినీ పరిశ్రమలోనూ వారసత్వం ఉంది. మంచి ప్రతిభ కలిగిన వారసులను ప్రేక్షకులు ప్రోత్సహిస్తుండటాన్ని చూస్తున్నాం.
టాలెంట్ ఉన్న వారసులు చాలా మంది ఇండస్ట్రీలో స్థిరపడుతున్నారు. అయితే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అంత సులువు కాదు. సాధారణంగా వారసులపై అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు, క్రేజ్, ఒత్తిడిని భరించలేక చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. అయితే కొద్ది మంది మాత్రం సవాళ్లను స్వీకరించి ఎదుగుతారు. అలాంటి వారిలో ఒకరు కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్. తమిళంలో రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి పాపులారిటీ తెచ్చుకున్న హీరోగా విజయ్ను చెప్పొచ్చు. తమిళంలో ఫుల్ పాపులారిటీ ఉన్న విజయ్.. తెలుగువారికీ సుపరిచితుడే. ఇప్పుడు ఆయన నటిస్తున్న ప్రతి చిత్రం తెలుగులోకి అనువాదమవుతోంది.
‘స్నేహితుడు’, ‘తుపాకీ’, ‘పోలీసోడు’, ‘విజిల్’, ‘సర్కార్’, ‘బీస్ట్’, ‘వారసుడు’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు విజయ్ బాగా దగ్గరయ్యారు. ఈస్థాయికి చేరుకునేందుకు విజయ్ చాలా కష్టపడ్డారు. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.ఏ చంద్రశేఖర్ కొడుకే విజయ్. ఆయన తల్లి శోభ ఒక క్లాసికల్ సింగర్. సినిమాలపై ఇష్టంతో చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. కానీ బక్కగా ఉన్నాడని, డ్యాన్స్ రాదని ఆయనపై విమర్శలు వినిపించాయి. అయితే వెనక్కి తగ్గని విజయ్.. ఫిట్నెస్ను పెంచుకుని, డ్యాన్సులు బాగా ప్రాక్టీస్ చేసి ఆ రెండింటినీ బలంగా చేసుకుని ఎదిగారు. విజయ్ సినిమా అంటే మినిమం రూ.200 కోట్ల వసూళ్లు రావాల్సిందే అనే రేంజ్‌కు ఎదిగారు. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ పాన్ ఇండియా హీరోకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి విజయ్‌కు సంబంధించిన చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చిన్నారి విజయ్ ఇందులో స్టైల్‌గా నిల్చుని ఫోజు ఇచ్చారు.