‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విజయ్ ఆంటోని. ఆ తర్వాత పలు సినిమాలతో తెలుగువారిని పలకరించినా అవేవీ సక్సెస్ కాలేదు. అయితే ఇటీవల ‘బిచ్చగాడు 2’తో వచ్చి మరో విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు విజయ్ ఆంటోని.
ఎన్నాళ్లుగానో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో విజయ్ ఆంటోనీకి ఎట్టకేలకు రిలీఫ్ లభించింది. ‘బిచ్చగాడు 2’ చిత్రం రూపంలో ఆయనకు ఆశించిన విజయం దక్కింది. ఈ సినిమాకు ఫస్ట్ వీక్‌లో తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు రావడం గమనార్హం. తెలుగు నాట ప్రాఫిట్ రన్‌ను కొనసాగిస్తున్న ‘బిచ్చగాడు 2’ ఇంకా ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాకు అన్నీ తానై పనిచేశారు విజయ్ ఆంటోని. హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ‘బిచ్చగాడు 2’ను తన భుజాలపై మోశారు. ఎట్టకేలకు మూవీ మంచి విక్టరీ కొట్టడంతో ఆయన సంతోషంలో మునిగిపోయారు. బుధవారం తిరుపతిలో సందడి చేశారాయన. ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా తిరుపతికి వచ్చారు విజయ్ ఆంటోని.
తిరుపతి కపిలతీర్థంలోని రోడ్డులో ఉన్న యాచకులను కలిశారు విజయ్ ఆంటోని. వారికి ‘యాంటీ బికిలీ’ పేరిట కిట్లను హీరో అందజేశారు. దుప్పటి, చెప్పులు, అద్దం, సబ్బు, నూనె బాటిల్, దువ్వెన, విసనకర్ర ఉన్న కిట్స్‌ను యాచకులకు అందజేశారు విజయ్ ఆంటోని. వారితో కాసేపు గడిపాక మీడియాతో మాట్లాడారాయన. ‘బిచ్చగాడు 2’ సక్సెస్‌పై తాను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. తెలుగు ఆడియెన్స్ ఈ మూవీని ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారని.. దీన్ని తాను ఊహించలేదన్నారు. ‘బిచ్చగాడు 3’ స్టోరీ లైన్ విషయంలో ఇంకా ఏమీ అనుకోలేదని.. రెండు, మూడు నెలల్లో దాన్ని ఫైనలైజ్ చేస్తానన్నారు విజయ్ ఆంటోని. ‘బిచ్చగాడు 2’ థియేటర్లలో 50 రోజులు ఆడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మళ్లీ అర్ధ శతదినోత్సవం రోజు తిరుపతికి వచ్చి అందర్నీ కలుస్తానని విజయ్ ఆంటోని పేర్కొన్నారు.