కోలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలకు దీటుగా వైవిధ్యమైన చిత్రాలనూ తెరకెక్కిస్తుంటారు అక్కడి మేకర్స్. ఈ క్రమంలో రూపొందిన మరో డిఫరెంట్ మూవీనే ‘విడుదలై పార్ట్-1’. తెలుగులో ‘విడుదల పార్ట్-1’గా డబ్ అయిన ఈ ఫిల్మ్.. తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమాను ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే..
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన చిత్రాలు తీసే దర్శకుల్లో ముందు వరుసలో ఉంటారు వెట్రిమారన్. ఆయన తీసిన ‘వడా చెన్నై’, ‘విసారణై’, ‘అసురన్’ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడమే గాక అవార్డులనూ కొల్లగొట్టాయి. దీంతో వెట్రిమారన్ మూవీస్‌లో నటించాలని కోరుకునే నటుల సంఖ్య పెరిగింది. మట్టి కథలను తీసుకొని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించే వెట్రిమారన్‌తో మూవీ చేయాలని స్టార్ హీరోలు కూడా అనుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం కమెడియన్ సూరితో చిత్రం తీసేందుకు సిద్ధమయ్యారు. సూరి ప్రధాన పాత్రలో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో వెట్రిమారన్ రూపొందించిన మూవీనే ‘విడుదలై పార్ట్-1’. తమిళంలో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘విడుదలై పార్ట్-1’ను తెలుగులోకి ‘విడుదల పార్ట్-1’గా తీసుకొచ్చారు. ఈ చిత్రం ఇక్కడ ఆశించిన మేర విజయం సాధించకపోయినా.. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలను మాత్రం దక్కించుకుంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదల అవుతుందా అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘విడుదల’ తమిళ వెర్షన్లో జీ5 ఓటీటీలో రిలీజైంది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ విడుదల కోసం ఇక్కడి ప్రేక్షకులు ఎదురు చూశారు. మొత్తానికి వెట్రిమారన్ తీసిన ‘విడుదల’ చిత్రం తెలుగు వెర్షన్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. జీ5 ఓటీటీ వేదికగా ఇక మీదట ‘విడుదల పార్ట్-1’ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తెలుగువారికి ఎంటర్టైన్మెంట్ అందించనుంది.