ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మిక మరణం అందరి హృదయాలను కలచి వేసింది. ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, టాలీవుడ్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జక్కుల నాగేశ్వరరావు ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇలా వరుస విషాదాలు మరువక ముందే ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. తలకు గాయం కావడం వల్ల గురువారం, బెంగళూరులోని ఆస్పత్రిలో చేరిన ఆయన.. శనివారం మరణించారు.
1938, జనవరి 28న జన్మించిన శివరాం 1958లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆయన తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. కేఆర్ సీతారామ శాస్త్రి, పుట్టన్న కనగల్, సింగీతం శ్రీనివాసరావు వంటి అగ్ర దర్శకుల వద్ద శివరాం పనిచేశారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు కన్నడ సినిమాల్లో ఆయన పనిచేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్య పాత్రలు, సహాయపాత్రలు పోషించారు. 1965 సినిమాలో ‘బేరత జీవా’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు.
1972లో హృదయ సంగమ అనే చిత్రంతో శివరాం దర్శకుడిగా మారారు. కన్నడలో పలు సినిమాలు నిర్మించిన శివరాం రజనీకాంత్‌తో తమిళంలో ధర్మ దురై అనే సినిమాను నిర్మించారు. 90కి పైగా సినిమాల్లో నటించారు. 2010-11 ఏడాదికిగాను డాక్టర్.రాజ్‌కుమార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును కర్ణాటక ప్రభుత్వం శివరామ్‌కు బహుకరించింది. అలానే 2013లో పద్మభూషణ్ డాక్టర్ బీ.సరోజిని జాతీయ అవార్డు ఈయనను వరించింది.