ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూశారు. ఇక కరోనా మహమ్మారితో పలువురు సినీ తారలు కన్నుమూశారు. బాలీవుడ్ లో గత రెండేళ్లుగా వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు రమేష్ దేవ్ (93) బుధవారం సాయంత్రం ముంబైలో మరణించారు.
బుధవారం రాత్రి ఆయనకు గుంటెపోటు రావడంతో హుటా హుటిన కుటుంబ సభ్యులు కోకిలాబేన్ దీరూబాయ్ అంబాని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోవడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1962లో ‘ఆర్తీ’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన రమేశ్ ‘ఆనంద్’, ‘మేరే అప్నే’, ‘ఆప్ కీ కసమ్’, డ్రీమ్ గర్ల్’, ‘జాలీ ఎల్.ఎల్.బి.’, ‘ఘాయల్ వన్స్ ఎగైన్’ తో పాటు దాదాపు 250 చిత్రాలలో నటించారు. టాయ్, జీవన్ మృత్యు, రాంపూర్ కా లక్ష్మణ్, కోరా కాగజ్ వంటి ప్రముఖ హిందీ చిత్రాలలో సహాయక పాత్రల్లో కూడా మంచి ఆదరణ పొందాడు. రమేష్ దేవ్ ఎంతో సౌమ్యులని.. గొప్ప నటుడు అని పలువురు సినీ సెలబ్రెటీలు ఆయనకు సంతాపాన్ని ప్రకటించారు. ఇక రమేష్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.