వేణు మాధవ్.. టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగాడు. తన కెరీర్‌లో అందరూ హీరోలతో పని చేశాడు. దర్శకులు తమ సినిమాల్లో వేణుమాధవ్ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు క్రియేట్ చేసేవారు. మిమిక్రి ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. టాలీవుడ్‌లో టాప్ కమెడియన్ స్థాయికి చేరుకున్నాడు. హీరోగా కూడా రాణించాడు. ఇటు బుల్లితెర మీద కూడా ఉదయభానుతో కలిసి యాకంర్‌గా కొన్ని షోలు చేశాడు. తర్వాత ఎన్టీఆర్ మీద అభిమానంతో.. టీడీపీ తరఫున ప్రచారం కూడా చేశాడు. ఇలా అన్ని రంగాల్లో విజయం సాధించిన వేణు మాధవ్.. కాలేయ సంబంధిత వ్యాధితో 2019లో మరణించాడు.
ఈ క్రమంలో తాజాగా వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ.. ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వేణు మాధవ్ చనిపోవడానికి గల కారణాలు వివరించారు. అంతేకాక వేణుమాధవ్ మృతి చెందాక తనను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సావిత్రమ్మ మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన ఓ తప్పు వల్ల.. నా కొడుకు వేణు మాధవ్ చనిపోయాక.. నేను ఆర్థిక కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తోంది. వేణుమాధవ్ కెరీర్‌లో బిజీగా ఉన్న సమయంలో.. నా ఇద్దరూ కొడుకులను తనకు అసిస్టెంట్లుగా చేశాను.అదే నేను చేసిన అతి పెద్ద తప్పు’’ అన్నారు.
‘‘నా కొడుకు వేణు మాధవ్ చనిపోయే నాటికి తనకి రూ. 20 కోట్ల ఆస్తులున్నాయి. కానీ ప్రస్తుతం నేను, నా మూడో కొడుకు అద్దె ఇంట్లో ఉంటున్నాం. అందుకు కారణం నేనే. ఎందుకంటే వేణు సినిమాలతో బిజీగా ఉండటంతో నా ఇద్దరు కొడుకులను తనకు అసిస్టెంట్లుగా పెట్టాను. అయితే దురదృష్టవశాత్తు.. వేణు చనిపోవడంతో వారు ఎదుగు బోదుగు లేకుండా అలాగే ఉండిపోయారు. ఇక నా పెద్ద కొడుకు చనిపోయిన 45 రోజులకే వేణు మాధవ్ మృతి చెందాడు. వేణు చనిపోయాక నా మూడో కొడుకుకి ఉపాధి కరువై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక వేణు చనిపోయే నాటికి రూ. 20 కోట్లకి పైగా ఆస్తులున్నాయి. వేణు ఇద్దరు కొడుకులు వారి సొంతింట్లోనే ఉంటున్నారు. నేను మాత్రం నా మూడో కొడుకుతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాను.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సావిత్రమ్మ. వేణు మాధవ్ తల్లి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.