మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ 75వ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విక్టరీ వెంకటేశ్ మూడు సినిమాల్ని ఏక కాలంలో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. వాటిలో ‘నారప్ప’ సినిమా ఇటీవల రీషూట్స్ జరుపుకోగా, అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. మూడో షెడ్యూల్ కు కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దాంతో సినిమా షూటింగ్ కు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక ‘దృశ్యం 2’ సినిమా అతి వేగంగా టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు వెంకీ ల్యాండ్ మార్క్ మూవీ పై పడింది అందరి దృష్టి. ఆయన కెరీర్ లో 75వ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నాడనే వార్త అభిమానుల్ని ఆనందపరుస్తోంది. నిజానికి వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబో మూవీ ఎప్పుడో రావాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు త్వరలోనే ఈ సినిమా మేటీరియలైజ్ కాబోతోందట. ఈ సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ నడుస్తున్నాయని , త్రివిక్రమ్ వెంకీతో టచ్ లో ఉంటున్నాడని తెలుస్తోంది.
గతంలో త్రివిక్రమ్ వెంకీ నటించిన ‘నువు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు’ చిత్రాలకు రైటర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీస్ లో త్రివిక్రమ్ డైలాగ్స్ ఏ రేంజ్ లో పేలాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇప్పుడు ఈ కాంబో మూవీకి భలే క్రేజ్ ఏర్పడింది. వెంకీ అద్భుతమైన కామెడీ టైమింగ్ కు త్రివిక్రమ్ చమత్కార సంభాషణలు తోడై అది కూడా ఆయన దర్శకత్వంలో రూపొందితే ఆ సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహించొచ్చు. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి. త్రివిక్రమ్ ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత వెంకీ సినిమాకి సంబంధించి ప్రకటన రావచ్చు అంటున్నారు.