2023.. సంక్రాంతి బాక్సాఫీస్ వార్ కి రంగం సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాలలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి. నటసింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ‘వారసుడు’ సినిమా పోటీకి దిగుతోంది. రెండు పెద్ద నిర్మాణ సంస్థల నుండి ఈ మూడు సినిమాలు రిలీజ్ అవుతుండగా.. ఒక్కో సినిమా ప్రమోషన్స్ ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేస్తున్నాయి. మరోవైపు సాంగ్స్ కాకుండా ట్రైలర్స్ తో సినిమాలపై హైప్ ఇంకా పెరిగిపోయింది. మరి స్టార్ హీరోల సినిమాల మధ్య సంక్రాంతి పోటీ ఎలా ఉండబోతుంది? ట్రైలర్స్ కి ఎలాంటి రెస్పాన్స్ దక్కింది? అనేది చూద్దాం!
సంక్రాంతి బరిలో ముందుగా దళపతి విజయ్ నటించిన ‘వారసుడు'(తమిళంలో వారిసు) రిలీజ్ అవుతోంది. ఫస్ట్ టైమ్ తెలుగు ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాంబినేషన్ లో విజయ్ చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా.. వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. జనవరి 11న సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాగా.. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే సాంగ్స్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ లభించింది. విజయ్ క్యారెక్టర్ తో పాటు మ్యూజిక్, డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ 30 మిలియన్స్ దాటి ట్రెండ్ అవుతోంది.
ఇక వారసుడు విడుదలైన మరుసటి రోజే.. జనవరి 12న నటసింహం బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ తెరమీదకు వస్తోంది. గాడ్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ లైన్ తో బాలయ్యను ఊరమాస్ రేంజ్ లో చూపించేశాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ట్రైలర్ లో విజువల్స్, బాలయ్య ఎనర్జీ, డైలాగ్స్, ఫైట్స్, డాన్సులు అన్నీకూడా సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తుండగా.. శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే తమన్ అందించిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ లో మాస్ అంశాలతో పాటు ఎమోషన్స్ ని జోడించి ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ చూసేలా ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీని ట్రైలర్ కూడా మిలియన్స్ దూసుకుపోతూ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
వారసుడు, వీరసింహారెడ్డి విడుదలైన మరుసటి రోజు.. జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రిలీజ్ కానుంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ రవీంద్ర తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఫుల్ ఫన్ తో పాటు ఎమోషన్స్.. భారీ యాక్షన్ సీక్వెన్సెస్.. దేవిశ్రీ అందించిన ఎనర్జిటిక్ సాంగ్స్.. మాస్ రాజా ఎంట్రీ.. అన్నికూడా వీరయ్యపై అంచనాలు పీక్స్ లోకి చేర్చాయి. పైగా ఈ సినిమాని కూడా మైత్రి మూవీస్ వారే ప్రొడ్యూస్ చేయడం విశేషం. అయితే.. మొన్నటివరకూ సీరియస్ నెస్ చూసిన ఫ్యాన్స్.. ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని చూడబోతున్నారు. చూస్తుంటే.. కలెక్షన్స్ కూడా అదరగొట్టేలా ఉందని అంటున్నారు. మొత్తానికి మెగాస్టార్, ఈ సంక్రాంతికి బాలయ్య, విజయ్ లతో బరిలోకి దిగుతున్నాడు. ఈ మూడు సినిమాలు మంచి హైప్ క్రియేట్ చేసి, భారీ అంచనాలు సెట్ చేశాయి. ఈ ముగ్గురి లాస్ట్ మూవీస్ కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాయి. సో.. ఈ మూడు సినిమాలలో మీకు బాగా నచ్చిన ట్రైలర్.. మీ అంచనాలు అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి. ఈ మూడు సినిమాలతో పాటు స్టార్ హీరో అజిత్ నటించిన ‘తెగింపు’ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. మరి ప్రమోషన్స్ పెద్దగా చేయట్లేదు కానీ.. సినిమాకి కోలీవుడ్ ఫ్యాన్స్ లో హైప్ బాగానే ఉంది.