సీనియర్ నటులు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఏఐజీ హాస్పిటల్ లో చేరిన కృష్ణంరాజు.. సెప్టెంబర్ 11న ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్ధం ఇవాళ ఉంచి.. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. రేపు ఉదయం ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి తరలించి.. మధ్యాహ్నం తర్వాత అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
కృష్ణంరాజు భౌతిక కాయాన్ని చూసేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అనుష్క వంటి ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. ప్రభాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయనను కడసారిగా చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో నటుడు వడ్డే నవీన్ కూడా ఆయన నివాసానికి చేరుకున్నారు. కోరుకున్న ప్రియుడు, పెళ్లి, మా బాలాజీ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్.. సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించారు. 2016లో మంచు మనోజ్ హీరోగా.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎటాక్ సినిమాలో నటించారు.
ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమాల్లో కనిపించలేదు. సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ లో గానీ, మరే ఇతర ఫంక్షన్స్ లో గానీ కనిపించని వడ్డే నవీన్.. ఇప్పుడు కృష్ణంరాజు మరణంతో బయటకు వచ్చారు. సాధారణంగా అస్సలు బయటకు కనిపించడానికి ఇష్టపడని నవీన్.. కృష్ణంరాజుతో ఉన్న అనుబంధం కారణంగా.. ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణంరాజుతో అనుబంధం, రుణబంధం ఉన్న వాళ్ళు ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.