సామాజిక సేవ, సోషల్ మీడియా, అపోలో ఆస్పత్రులకు చెందిన కార్యక్రమాలతో నిత్యం బిజీ బిజీగా గడుపుతారు మెగా కోడలు ఉపాసన. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక సమాజ సేవ చేయడంలో ఉపాసన ముందు వరుసలో ఉంటారు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకుంది ఉపాసన..
మెగా కోడలు ఉపాసన గురించి సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. పుట్టినిల్లు, మెట్టినిల్లు.. రెండు కుటుంబాలు సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఫ్యామిలీలే. అయినా సరే.. ఉపాసన.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రులకు చెందిన కార్యక్రమాలు చూసుకోవడమే కాక.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ.. తన గొప్ప మనసు చాటుకుంటుంది ఉపాసన. ఇవే కాక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ప్రస్తుతం ఉపాసన అమ్మతనంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. కొన్ని రోజుల క్రితమే దుబాయ్‌లో ఆమెకు శ్రీమంతం చేశారు స్నేహితులు, బంధువులు. ఇక తాజాగా ఉపాసన.. మరోసారి తన మంచి మనసు చాటుకుంది. ఆ వివరాలు.
ఉపాసన ప్రస్తుతం అపోలో లైఫ్‌కి మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. వ్యాపార రంగంలోనూ రాణిస్తూనే మరోవైపు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన తన సంపాదనను మహిళల కోసం విరాళంగా అందించి మరోసారి మంచి మనసు చాటుకుంది. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో హౌజ్ ఆఫ్ టాటా వారి జోయా కొత్త స్టోర్‌ను ప్రారంభించింది ఉపాసన. ఈ క్రమంలో స్టోర్ ప్రారంభించింనందుకుగాను.. యాజమాన్యం ఇచ్చిన రెమ్యునరేషన్‌ను మహిళల కోసం విరాళంగా అందించింది ఉపాసన. ఈ మొత్తాన్ని దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్, దాని కార్యక్రమాలకు విరాళంగా అందించింది. అణగారిన వర్గాలకు చెందిన మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తమ దోమకొండ ట్రస్ట్ కట్టుబడి ఉంటుందని తెలిపింది ఉపాసన.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..‘‘హౌస్ ఆఫ్ టాటా నుంచి జోయా స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో ప్రారంభించడం సంతోషంగా ఉంది. జోయాలో లభించే ఆభరణాలు విలాసవంతమైన జువెలరీకి కేరాఫ్ అడ్రస్. ప్రారంభోత్సవానికి అతిథిగా ఆహ్వానించి జోయాకు ప్రత్యేక కృతజ్ఞతలు. మహిళా సాధికారతను అందించే లక్ష్యంతో దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు మద్దతునిస్తున్నాయి. అందుకే నేను కూడా నా వంతు సాయంగా.. ఈ మొత్తాన్ని దోమకొండ పోర్ట్‌కు డొనేట్ చేస్తున్నాను’’అని చెప్పుకొచ్చింది ఉపాసన. ఆమె చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఉపాసన నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.