ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టాలు అనుభవించాలి. అయితే దాని కంటే ముందు ఇండస్ట్రీలో అడుగుపెట్టాలన్నా కూడా ఇంకా ఎన్నో కష్టాలు పడాలి. ఇప్పుడంటే సోషల్ మీడియా కారణంగా టాలెంట్ చూపించి అవకాశాలు పొందుతున్నారు గానీ ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దాని కంటే ముందు పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకాల్సి వచ్చేది. అలా ఒక నటి అవకాశాలు రావడం కోసం హౌజ్ కీపర్ గా, సేల్స్ గర్ల్ గా పని చేశారు.
సక్సెస్ అంత తేలిగ్గా రాదు. నచ్చిన పని దొరికే వరకూ నచ్చని పని అయినా నచ్చినట్టే చేయాల్సి ఉంటుంది. నచ్చిన పనిలో రాణించాలంటే నచ్చకపోయినా రాజీ పడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఇండస్ట్రీకి వచ్చి ఎదిగిన సెలబ్రిటీలు చాలా మంది ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డవారే. దొరికిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇవాళ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు. అలా కింద నుంచి పైకొచ్చిన వారిలో త్రినయని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరామ్ ఒకరు. తన నటనతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్న పవిత్ర జయరామ్ హౌజ్ కీపర్ గా పని చేశారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనతో కర్ణాటకలోని మాండ్య నుంచి బెంగళూరు వచ్చానని.. ఐతే తాను పెద్దగా చదువుకోకపోవడం వల్ల హౌజ్ కీపర్ గా పని చేశానని అన్నారు. కొన్ని రోజులు హౌజ్ కీపింగ్ చేసి.. ఆ తర్వాత బట్టల దుకాణంలో, లైబ్రరీలో కూడా పని చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను ఇబ్బందులు పడడం తన ఫ్రెండ్ చూసి ఒక ఫిల్మ్ మేకర్ నంబర్ ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సిరి గంధం శ్రీనివాసమూర్తిని కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో కన్నడ సీరియల్స్ లో చేయాలన్న ఆలోచన వచ్చిందని.. పలు సీరియల్స్ కి ఆడిషన్స్ కు వెళ్లేదాన్నని, చిన్న చిన్న రోల్స్ వస్తే చేశానని అన్నారు.
ఆ తర్వాత జోకాలి అనే కన్నడ సీరియల్ లో హీరోకి చెల్లెలి పాత్ర వస్తే చేశానని అన్నారు. అక్కడ నుంచి తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్ లో అవకాశం వచ్చిందని అన్నారు. ఆ సమయంలో తనకు తెలుగు అస్సలు అర్ధమయ్యేది కాదని.. ఆ సీరియల్ లో నటించే వారంతా తెలుగులో మాట్లాడుతుంటే అర్థం కాక ఒక పక్కన సైలెంట్ గా కూర్చునేదాన్నని అన్నారు. ఒకానొక సమయంలో సీరియల్స్ వదిలేసి వెళ్లిపోవాలని అనుకున్నానని అన్నారు. అప్పుడు తన పరిస్థితిని అర్థం చేసుకున్న తోటి నటులు తనకు ధైర్యం చెప్పారని.. తెలుగు చదవడం, రాయడం నేర్పించారని అన్నారు. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నానని అన్నారు.
సీరియల్స్ లోనే కాకుండా బుచ్చినాయుడు కండ్రిగ అనే సినిమాలో కూడా నటించానని.. ఓటీటీలో విడుదలైందని అన్నారు. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని.. అందుకే ప్రతి రోజూ జిమ్ కు వెళ్తానని అన్నారు. ఆమె భర్త పేరు చంద్రకాంత్. ఒక పాప, బాబు ఉన్నారని ఆమె వెల్లడించారు. ఇలా ఆమె హౌజ్ కీపర్ గా, బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా, లైబ్రరీలో పని చేసి.. ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరి.. ఇప్పుడు నటిగా ఎదిగారు. మరి కింద నుంచి పైకొచ్చిన పవిత్ర జయరామ్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.