శామీర్ పేట్ లో సీరియల్ నటుడు మనోజ్.. సిద్దార్థ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపాడని వస్తున్న వార్తలపై మనోజ్ కుమార్ స్పందించారు. తన ఇన్స్టా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.
శామీర్ పేట్ సెలబ్రిటీ రిసార్ట్ లోని విల్లాలో సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై మనోజ్ నాయుడు అనే వ్యక్తి కాల్పులు చేసిన ఘటన గురించి తెలిసిందే. 2019లో భర్త సిద్ధార్థ్ దాస్ నుంచి స్మిత విడిపోయింది. విడాకుల కోసం కూకట్ పల్లి కోర్టులో అప్లై చేసింది కూడా. అంతేకాదు భర్త మనోజ్ తన జోలికి రాకుండా ఉండడం కోసం ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత స్మిత మనోజ్ తో కలిసి ఒక సాఫ్ట్ వేర్ కంపెనీని ఏర్పాటు చేసింది. సెలబ్రిటీ రిసార్ట్స్ లో వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకున్నారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి ఉండేవారు. అయితే ఇటీవల మనోజ్ స్మిత కొడుకు మీద చేయి చేసుకున్నాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్ధార్థ్ దాస్ కు చెప్పాడు.
చెల్లిని కూడా వేధిస్తున్నట్లు బాలుడు తండ్రికి చెప్పడంతో పాపను తీసుకెళ్లడానికి శనివారం ఉదయం సిద్ధార్థ్ దాస్ స్మిత ఇంటికి చేరుకున్నాడు. పాపను సిద్దార్థ్ కిచ్చి పంపడం ఇష్టం లేని స్మిత అతనితో గొడవకు దిగింది. దీంతో స్మిత, సిద్దార్థ్, మనోజ్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెద్దదవ్వడంతో మనోజ్ ఎయిర్ గన్ తీసుకుని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కాల్పులు జరిపిన మనోజ్.. సీరియల్ నటుడని ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ కథనాన్ని ప్రసారం చేశాయి. అయితే దీనిపై నటుడు మనోజ్ కుమార్ స్పందించారు. సిద్ధార్థ్ పై నటుడు మనోజ్ కుమార్ కాల్పులు జరిపిన ఘటనకు, తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు మనోజ్ కుమార్ వెల్లడించారు.
ఈరోజు ఉదయం నుంచి తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఎవరో మనోజ్ అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపితే అది నేను అనుకుని తన పేరు, ఫోటోలు, సీరియల్ క్లిప్స్ వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తాను బెంగళూరులో షూట్ లో ఉన్నానని అన్నారు. హైదరాబాద్ లో ఏం జరుగుతుందో తనకు తెలియదని.. ముందూ వెనకా తెలుసుకోకుండా ఇలా ఎలా చేస్తారని మండిపడ్డారు. కాల్పుల ఘటనలో ఉన్న మనోజ్ నాయుడు, తాను ఒకటి కాదని.. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. రెండు ప్రముఖ శాటిలైట్ ఛానల్స్ తన ఫోటోలు, సీరియల్ క్లిప్పింగ్స్ వాడి తన గురించి అసత్య ప్రచారం చేసి పరువుకు భంగం కలిగించారని.. దీని వల్ల తన కెరీర్, జీవితంపై దుష్ప్రభావం పడుతుందని.. దీనిపై పోలీస్ కంప్లైంట్ చేస్తానని అన్నారు. ఇది ఫేక్ న్యూస్. దయచేసి ఎవరూ నమ్మకండి అని అన్నారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియోని పోస్ట్ చేశారు.