మహిళల మీద సినిమాల ప్రభావం కంటే సీరియల్స్ ప్రభావం బాగా ఉందనడానికి తెలుగు బుల్లితెరను ఏలుతున్న సీరియల్సే నిదర్శనం. పాతతరం మొగలిరేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ చూసుకుంటే అప్పట్లో ఒక చరిత్రని సృష్టించాయి. మగవారు సైతం ఈ సీరియల్స్ కి అడిక్ట్ అయ్యేవారు. అప్పటికి, ఇప్పటికి ఏం మారింది సార్.. అప్పుడూ, ఇప్పుడూ సీరియల్స్ మీద ఉన్న క్రేజు, మోజు తగ్గలేదు. ఎప్పటిలానే ఇప్పుడు కూడా కొన్ని సీరియల్స్ తమ సత్తా చాటుతున్నాయి. వాటిలో కార్తీకదీపం ఒకటి. తెలుగు టీవీ రంగంలో కార్తీకదీపం సీరియల్ ది ఒక అధ్యాయం. ఈ సీరియల్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు మాత్రం ఆడియన్స్ మైండ్ లో బాగా రిజిస్టర్ అయిపోయాయి.
బయట కనిపించినా కూడా అవే పేర్లతో పిలిచేంతగా ఆ సీరియల్ తాలూకు పాత్రల ప్రభావం ప్రేక్షకుల మీద పడింది. 5 నిమిషాల్లో అయిపోయే సీన్ ని కూడా అయిదు వారాల పాటు సుదీర్ఘంగా సాగదీయగల సమర్థత.. దానికి తగ్గట్టు మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎపిసోడ్స్ ని రాయడం అనేది మామూలు విషయం కాదు. ఒకరకంగా దర్శకుడికి ఇది సాహసమనే చెప్పాలి. బ్రేక్ ముందు జరగబోయేది చూపించి.. రెండు, మూడు రోజుల తర్వాత కూడా జరగబోయేది అదే అని చూపించి ప్రేక్షకులని కన్విన్స్ చేయడానికి గట్స్ ఉండాలి. సీరియల్స్ సాగదీయడం అంటే మామూలు విషయం కాదు. సినిమాకి సీన్స్ రాయడం కంటే సీరియల్స్ కి ఎపిసోడ్స్ రాయడమే కష్టం అని అంటుంటారు.
ఒకటి, రెండు ఎపిసోడ్స్ రాయడానికే చుక్కలు కనబడతాయి. అలాంటిది 15 వందల ఎపిసోడ్స్ కి రాయడం అంటే మామూలు విషయమా? ఒకే పనిని రోజూ చేస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. కానీ ఒకే సీరియల్ కి సుదీర్ఘ కాలం పాటు ఎపిసోడ్స్ రాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎవరెన్ని విమర్శలు చేసినా, ట్రోల్స్ చేసినా, సెటైర్లు వేసినా విజయవంతంగా సీరియల్స్ ని నడిపిస్తున్నారు. అలా విజయవంతంగా నిర్విరామంగా ఐదేళ్ల పాటు కొన’సాగిన సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. అక్టోబర్ 16 2017లో మొదటి ఎపిసోడ్ తో మొదలైన ఈ కార్తీకదీపం 1500 ఎపిసోడ్ మైలురాయిని అందుకుంది. నిన్నటితో కార్తీకదీపం సీరియల్ విజయవంతంగా 1500 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా సీరియల్ యూనిట్ సభ్యులు పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. నిరుపం, ప్రేమి విశ్వనాథ్, శోభా శెట్టి సహా పలువురు నటులు, టెక్నీషియన్స్ 1500వ ఎపిసోడ్స్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. 1500 పేరుతో కేక్ తయారుచేయించి యూనిట్ సభ్యులంతా కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని సీరియల్ లో మౌనిత అనే విలన్ పాత్రలో నటించిన శోభా శెట్టి తన యూట్యూబ్ ఛానల్ లో అప్ లోడ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరెన్ని అనుకున్నా గానీ సీరియల్ ద్వారా వందల మందికి డైలీ పని దొరుకుతుంది. ఇలాంటి సీరియల్స్ విజయవంతంగా ఏళ్ల తరబడి ఆడాలనే ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు.