రీతూ చౌదరి.. సీరియల్ నటిగా కంటే జబర్దస్త్ లేడీ కమెడీయన్ గానే ఆమెకు ఎక్కువ ఫాలోయింగ్, గుర్తింపు ఉంది. రీతూ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న బుల్లితెర ప్రేక్షకులు, జబర్దస్త్ కమెడీయన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నాన్న మృతిపై రీతూ చౌదరి భావోద్వేగానికి గురైంది. తండ్రిని తలుచుకుంటూ సోషల్ మీడియాలో రీతూ చౌదరి పోస్ట్ చేసింది.
తండ్రితో కలిసున్న ఫొటోని ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.. “నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఈ ఫొటో తీసుకునే సమయంలో ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఇది నీతో తీసుకున్న లాస్ట్ ఫొటో నాన్న. నన్ను ఎలా వదిలి వెళ్లిపోయావ్ నాన్నా? నువ్వు లేకుండా నేను ఉండలేను. డాడీ ప్లీజ్ తిరిగిరా నీ కూతురు దగ్గరికి” అంటూ రీతూ చౌదరీ ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీతూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
రీతూ చౌదరికి ఆమె తండ్రితో ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఇంట్లో అందరి కంటే ఆమెకు తండ్రి అంటేనే చాలా ఇష్టం. ఏదున్నా ఆయనతోనే పంచుకుంటుంది. ఆయనకు నచ్చినట్లుగానే ఉంటుంది. అలాంటిది ఇప్పడు ఆ తండ్రి లేడనే విషయాన్ని రీతూ చౌదరి జీర్ణించుకోలేకపోతోంది. అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి తనతో లేడని, ఇంక రాడనే విషయంపై రీతూ చౌదరి కన్నీరు మున్నీరవుతోంది. జబర్దస్త్ కమెడీయన్లు, రీతూ చౌదరి అభిమానులు ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరలంటూ ప్రార్థిస్తున్నారు.