తెలుగు టీవీ కామెడీ షోస్ లో జబర్దస్త్ సెట్ చేసిన బెంచ్ మార్క్ మరే షో సెట్ చేయలేకపోయిందనేది వాస్తవం. గురువారం,శుక్రవారం వచ్చాయంటే చాలు టీవీల ముందు అతుక్కుపోతారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు సెట్ చేసిన ట్రెండ్ అలాంటిది. జబర్దస్త్ షోలో అవకాశం వస్తే చేయాలనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది సహా ఎంతోమంది స్టార్ కమెడియన్స్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ లో చాలా మంది సినిమాల్లో అవకాశాలు పొందారు. సినిమా ఈవెంట్లు, ఇతర షోలు చేసుకుంటూ చేతి నిండా డబ్బు సంపాదించుకుంటున్నారు.
సినిమాల్లో వెలుగు వెలిగి.. అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఆర్టిస్ట్ లు కూడా ఈ కామెడీ షోలో చేసి మరలా అవకాశాలు పొందుతున్నారు. ఇంత కీర్తి తెచ్చినటువంటి ఈ జబర్దస్త్ షోలో చేసే అవకాశం తాజాగా కమెడియన్ సద్దాంకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పటాస్ షోలో తన పంచులతో అలరించిన సద్దాం.. అతి తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అదిరింది కామెడీ షోలో అదిరిపోయే పంచులతో అదరగొట్టాడు. తోటి కమెడియన్ రియాజ్ తో కలిసి గల్లీ బాయ్స్ టీమ్ లో సద్దాం చేసిన రచ్చ మామూలుగా ఉండదు. గల్లీ బాయ్స్ టీమ్ లీడర్ గా సద్దాం వేసిన పంచులు ఇప్పటికీ క్రేజ్ ఉంది. పలనా ఎపిసోడ్ మళ్ళీ వేయండి ప్లీజ్ అనేంతగా సద్దాం తనదైన పంచులతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం కామెడీ ధమాకా, కామెడీ స్టార్స్ షోస్ తో రచ్చ లేపుతున్నాడు సద్దాం. జబర్దస్త్ లో హైపర్ ఆదికి ఏ మాత్రం తీసిపోని విధంగా సద్దాం పంచులు ఉంటాయి. ఒకరకంగా ఆదితో పోల్చుకుంటే.. సద్దాం పంచులు ఆహ్లాదకరంగా ఉంటాయి. హైపర్ ఆది పంచులు బాడీ షేమింగ్, డబుల్ మీనింగ్ మీద ఉంటాయని కొందరి నెటిజన్స్ అభిప్రాయం. సరే ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు సద్దాంకి జబర్దస్త్ షో నుంచి ఆహ్వానం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మరి సద్దాంని టీమ్ లీడర్ గా తీసుకుంటారా? లేక టీమ్ లో ఒక కంటిస్టెంట్ గా తీసుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ సద్దాం గనుక జబర్దస్త్ లో చేస్తే తిరుగుండదు అని సద్దాం అభిమానుల అభిప్రాయం.
ఇక సద్దాం టీవీ షోస్ తో పాటు పలు సినిమా ఈవెంట్లు చేస్తున్నాడు. రీసెంట్ గా జిన్నా సినిమాలో కూడా నటించాడు. సినిమాల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో సద్దాం.. జబర్దస్త్ షోకి వెళ్తే కెరీర్ పరంగా బాగుంటుందని.. గెటప్ శ్రీను, సుధీర్, హైపర్ ఆదిలా రేంజ్ పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఆహా ఓటీటీలో త్వరలో రానున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’ షోలో కూడా సద్దాం పార్టిసిపేట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షోకి సుడిగాలి సుధీర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోని దర్శకుడు అనిల్ రావిపూడి పరిచయం చేస్తూ ఇటీవల ప్రోమో రిలీజ్ చేశారు. మరి సద్దాం జబర్దస్త్, కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ వీటిలో ఏ షో చేయనున్నారు? రెండు షోస్ చేస్తారా? లేక ఏదో ఒకటే చేస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.