బీబీ జోడీ.. బిగ్ బాస్ తర్వాత ఆ స్థాయి రెస్పాన్స్ ఈ షోకి లభిస్తోంది. గతంలో బిగ్ బాస్ షోల పాల్గొన్న కంటెస్టెంట్లను తీసుకొచ్చి జోడీలుగా డాన్స్ పర్ఫార్మెన్సులు ఇప్పిస్తున్నారు. ఈ షోకి తరుణ్ మాస్టర్, రాధ, సదా జడ్జులుగా వ్యవహరిస్తుండగా శ్రీముఖి యాంకరింగ్ చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో మాటలు, ఆటలతో ఇరగదీసిన సభ్యులు ఇక్కడ డాన్సులతో రెచ్చిపోతున్నారు. ఒక్కో ఎపిసోడ్ కి ఒక థీమ్ పెట్టుకుని అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ కూడా బిగ్ బాస్ తరహాలోనే గొడవలకు ఏమాత్రం కొదవ లేదు. ప్రతి ఎపిసోడ్‌లో ఎవరో ఒకరు మాటలతో విరుచుకుపడుతూ ఉంటారు.
ఈ బీబీ జోడీలో ముఖ్యంగా రెండు జంటలు వారి ప్రదర్శనలతో ఫ్యాన్స్ నుంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఆ రెండు జంటలు ఒక మెహబూబ్- శ్రీసత్య కాగా మరో జంట అఖిల్ సార్దక్- తేజశ్వి. ఈ బీబీ జోడీలో వీళ్లు ఇచ్చే ప్రతి పర్ఫార్మెన్స్ అటు జడ్జులనే కాదు ఇటు ప్రేక్షకులను వావ్ అనేలా చేస్తోంది. ఇంక ఈ షోలో కౌశల్– అభినయశ్రీ జోడీ కూడా ఉంది. అభినయశ్రీ డాన్స్ గురించి, ఆమె టాలెంట్ గురించి ఎవరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంటే అమలాపురం పాటతో కుర్రకారుని ఏ రేంజ్ ఉర్రూతలూగించిందో అందరికీ తెలిసిందే. ఆమెతో పాటు కౌశల్ కూడా అలా అలా మేనేజ్ చేస్తున్నాడు.
తాజా ఎపిసోడ్ ప్రోమో చూస్తే అఖిల్ vs కౌశల్ అనేలా ఉంది. అఖిల్- తేజశ్వి చాలా కొత్తగా కథక్ థీమ్ ట్రై చేశారు. వారి పర్ఫార్మెన్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. డాన్స్ నచ్చితే పేపర్ చింపేసే తరుణ్ మాస్టర్ ఈసారి ఒకేసారి 3 పేపర్లు చింపేసి గాల్లోకి ఎగరేశారు. తాను ఇలా ఒకేసారి మూడు పేపర్లు చింపడం ఇదే తొలిసారి అని కూడా చెప్పాడు. తెలుగు టెలివిజన్ లో ఇలాంటి ఒక ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి అంటూ అఖిల్- తేజశ్విని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు మాత్రమే కాదు.. తోటి కంటెస్టెంట్లు కూడా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విషయంలో వారి మధ్య రచ్చ జరుగుతూ ఉంటుంది.
అందరూ అఖిల్ సార్దక్– తేజశ్వి ప్రదర్శనను పొగుడుతూ ఉంటే.. కౌశల్ మాత్రం ఒకటి తగ్గింది అంటూ కామెంట్ చేశాడు. “మీరు తీసుకుంది కథక్. కథక్ డాన్స్ లో థప్ థప్ అని స్టెప్స్ ఉండాలి. మీ డాన్సుల నాకు అవి కనిపించలేదు” అంటూ చెప్పాడు. దానికి అఖిల్ రగిలిపోయాడు. మా పాటలో అలాంటి స్టెప్పులు చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. నీ ఆటలు బిగ్ బాస్ హౌస్ లో పెట్టుకో ఇక్కడ కాదంటూ కౌంటర్ ఇచ్చాడు. అందుకు కౌశల్ నువ్వు కూడా బిగ్ బాస్ కి వెళ్లావ్ కదా? అంటూ ప్రశ్నించాడు. నేను నా కళ్లతో చూశాను అంటూ అనగా.. మేము కూడా మా కళ్లతోనే చూస్తామంటూ అఖిల్ కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి అఖిల్ vs కౌశల్ ఎపిసోడ్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందనే చెప్పాలి.