నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఓ వైబ్రేషన్ వస్తుంది. బాలయ్య సినిమా అంటే అభిమానులకు పూనకాలే. అలాంటి బాలయ్య హోస్ట్ గా ఒక షో వస్తోందనగానే అంతా పలు రకాలుగా స్పందించారు. షో సక్సెస్ అవుతుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ, బాలయ్య చేసిన అన్ స్టాబుల్ షో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోనే ఓటీటీలో టాప్ రేటెడ్ షోగా నిలిచింది.
ఇప్పుడు ఆ షో నుంచి రెండో సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది. అన్ స్టాపబుల్ సీజన్-2 త్వరలోనే పట్టాలెక్కబోతోంది. అయితే ఇప్పుడు ఈ షో ద్వారా బిగ్ బాస్ సీజన్-6కి పోటీ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా సెలబ్రిటీ హోదా అందుకున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. బిగ్ బాస్ ద్వారా కెరీర్ లో సెటిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు.
నిజానికి ఈ రెండూ షోలూ తెలుగు ప్రజల్లో ఎంతో గొప్ప ఆదరణను అందుకున్నాయి. బిగ్ బాస్ ఓటీటీని కూడా తెలుగు ప్రజలు ఆదరించిన విషయం తెలిసిందే. అన్ స్టాపబుల్ సీజన్-2 అయితే దీపావళి నుంచి ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే టాక్ జోరుగా నడుస్తోంది. సీజన్-2 కమింగ్ సూన్ అంటూ ఇంట్రడక్షన్ ప్రోమోలు కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. మరి బిగ్ బాస్ విషయానికి వస్తే సీజన్-6కు కొత్త లోగో, ప్రోమో అంటూ విడుదల చేశారు. ఈ సీజన్ కు కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునానే వ్యవహరిస్తున్నాడు.
అయితే బిగ్ బాస్ సీజన్- 6 కూడా అటుఇటుగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే బిగ్ బాస్ క్రూషియల్ స్టేజ్‌లో ఉన్న సమయంలో అన్ స్టాపబుల్‌తో బాలయ్య పోటీకి దిగుతాడు. అప్పుడు ప్రేక్షకుల్లో బాలయ్య అన్ స్టాపబుల్ గా నిలుస్తాడా? లేక బిగ్ బాస్ బాలయ్య షోని బీట్ చేస్తుందా? అనేది తెలుస్తుంది. బిగ్ బాస్-6, అన్ స్టాపబుల్ సీజన్-2 రెండింటిలో ఏది టాప్ ప్లేస్ లో నిలుస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.