సంతోషంగా ఉండే కుటుంబాన్ని చూస్తే ఓర్వలేక దిష్టి పెడతారని పెద్దలు చెబుతుంటారు. కన్ను దిష్టి, నర దిష్టి తగిలితే ఇక సంతోషాలు ఉండవని అంటూ ఉంటారు. తాజాగా అదిరే అభి కూడా అదే అంటున్నారు. జబర్దస్త్ లో ఒకానొక సమయంలో విభిన్నమైన కామెడీ స్కిట్లతో కడుపుబ్బా నవ్వించిన అభి.. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద కామెడీ చేసే కమెడియన్లు అందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. మాది జబర్దస్త్ ఫ్యామిలీ అని అనేవారు. అలాంటి ఫ్యామిలీకి దిష్టి తగిలిందని అదిరే అభి అంటున్నారు. జబర్దస్త్ కి దిష్టి తగిలింది అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
‘మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది. జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్ తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టిన కంటిస్టెంట్లు, అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు, సమయం ఆగేది కాదు. కుశల ప్రశ్నలు, ఆపన్నహస్తాలు, జోకులు మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు. బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, అనసూయ రష్మీల అందం, స్కిట్ల మాయాజాలం. స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్లు, అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు’ ఇవేమీ ఇప్పుడు కనబడడం లేదని అర్థం వచ్చేలా అదిరే అభి రాసుకొచ్చారు.
‘ఎవరి దిష్టి తగిలిందో, ఏక తాటి మీద నడిచిన మాకు ఎవరి దారి వారిదయ్యింది. ఎవడైనా పల్లెత్తి మాట అంటే పడని మేము, మమ్మల్ని మేమే మాటలు అనుకుంటున్నాం. సమయం వెనక్కి వెళ్తే బాగుండు, ఆరోజులు తిరిగి వస్తే బాగుండు. అందరినీ నవ్వించే జబర్దస్త్ కి, మళ్ళీ నవ్వే రోజులు వస్తే బాగుండు అంటూ అదిరే అభి భావోద్వేగంతో కూడిన లెటర్ ను వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేశారు. ప్రస్తుతం చాలా మంది జబర్దస్త్ ఆర్టిస్టులు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు. రోజా, నాగబాబు, అనసూయ, కిరాక్ ఆర్పీ వంటి వాళ్లు ఇప్పుడు లేరు. అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసారు. బహుశా.. ఒకప్పుడు కలిసి చేసిన వాళ్లంతా.. ఇప్పుడు చేయడం లేదని బాధలో.. మళ్ళీ పాత రోజులు వస్తే బాగుణ్ణు అని అనుకున్నారేమో. దీనికి తోడు.. మల్లెమాల యాజమాన్యం మీద ఆరోపణలు, ఒకరి మీద ఒకరు విమర్శలు వంటివి నచ్చక ఇలా పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతుంది. మరి తన బాధను అక్షరాల రూపంలో వ్యక్తం చేసిన అదిరే అభిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.