చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకూ బాగున్న వాళ్ళని కూడా ఎత్తుకెళ్లిపోతుంది. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో, రకరకాల కారణాలతో అనేకమంది చనిపోతూ ఉంటారు. అయ్యో పాపం అని బాధపడతాం. అదే సినిమాలు, టీవీ సీరియల్స్ షోల ద్వారా ప్రేక్షకులకు కుటుంబ సభ్యుల్లా కలిసిపోయే నటులు చనిపోతే జీర్ణించుకోలేము. ఇన్నాళ్లు మనలో ఒకరిగా కలిసిపోయి నవ్వించి, ఏడిపించి, అన్ని ఎమోషన్స్ తో మనకి కనెక్ట్ అయిపోయిన నటులు ఉన్నట్టుండి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇటీవల కాలంలో డ్యాన్స్ చేస్తూ కొంతమంది చనిపోవడం చూశాం. ఉత్సవాల్లోనూ, ఫంక్షన్స్ లోనూ డ్యాన్సులు చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వాళ్ళని చూశాం. తాజాగా ఒక ప్రముఖ నటుడు జిమ్ చేస్తుండగా గుండెపోటు వచ్చి చనిపోయాడు.
సెలబ్రిటీ కావడంతో ఆ నటుడి మరణం పట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు. బుల్లితెర ప్రపంచంలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నటువంటి సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (46) నవంబర్ 11న చనిపోయాడు. జిమ్ చేస్తుండగా గుండెపోటు వచ్చి పడిపోయినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. అందరూ ముద్దుగా ఎస్వీ అని పిలుచుకునే నటుడు ఇలా ఉన్నట్టుండి చనిపోవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. కుసుమ్ అనే షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన సిద్ధాంత్.. బాలీవుడ్ లో అనేక షోస్, సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. కృష్ణ అర్జున్, కయామత్ సహా అనేక టెలివిజన్ సిరీస్ లలో తన నటనతో మెప్పించాడు. మోస్ట్ హ్యాండ్ సమ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న సిద్ధాంత్.. ప్రముఖ సూపర్ మోడల్ అలేసియా రౌత్ ను 2017లో వివాహం చేసుకున్నాడు. భర్త సిద్ధాంత్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.