మరణం అనేది సహజం. ఒకరి తర్వాత ఒకరు పరలోకానికి పయనం కావాల్సిందే. కాకుంటే.. ఆ విషాదాన్ని మనంతకు మనం చేజేతులా తీసుకోవడం మరింత భాధాకరం. ఇప్పటికే ఈ ఏడాదిలో ఎందరో సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మొదలుకొని.. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కైకాల సత్యనారాయణ వరకు ఎందరో అసువులు బాసారు. వీరి మృతితో సినీ ప్రపంచం విషాధఛాయల్లో ఉంటే.. ఆత్మహత్య చేసుకొని పరలోకానికి చేరుతున్న వారు మరింత బాధను మిగుల్చుతున్నారు. ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) శనివారం ఆత్మహత్య చేసుకుంది. సెట్‌లో ఉండగానే ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తునీషా శర్మ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. ఇవాళ టీవీ సీరియల్ షూట్ పాల్గొన్న ఆమె, మేకప్ వేసుకోవడానికి రూంలోకి వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె ఎంతకీ బయటకి రాకపోవడంతో.. అక్కడున్న సిబ్బంది వెళ్లి చూడగా అప్పటికే ఉరేసుకొని కనిపించింది. హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చక్రవర్తి అశోక్ సామ్రాట్, మహారాణా ప్రతాప్, అలీబాబా వంటి పలు సీరియల్స్ తో పాటు దబాంగ్ 3, కహానీ 2 వంటి చిత్రాల్లోనూ తునీషా నటించి గుర్తింపు తెచ్చుకుంది. కాగా తునీషా ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.