సీనియర్ నటి తులసి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు ఏడాదిన్నర వయసు నుంచే నటిస్తోంది. భార్య సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాల నటిగా పలు చిత్రాల్లో నటిందింది. వీటిల్లో మహాలక్ష్మి, శంకరాభరణం సినిమాలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత యవ్వనంలో శుభలేఖ వంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలో కనిపించింది. వివాహం అయిన తర్వాత సినిమాకు గ్యాప్ ఇచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో మోడ్రన్ తల్లి, అత్త క్యారెక్టర్లు చేస్తోంది. వీటిల్లో డార్లింగ్ సినిమాలో ఇంగ్లీష్ భాషపై అభిమానం ఉన్న మహిళ పాత్రలో అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా కార్తికేయ 2, రంగరంగవైభవంగా చిత్రాల్లో కనిపించింది. తులసి ప్రాధాన పాత్రలో నటించిన అనుకోని ప్రయాణం సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తులసి తన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఓ అద్భుత సంఘటన గురించి వివరించింది.
ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ.. ‘‘ నేను చాలా పేదింటికి కోడలిగా వెళ్లాను. అయితే బాబా దయ వల్ల మా కష్టాలు తీరాయి. ప్రారంభంలో నేను బాబాను నమ్మేదాన్ని కాదు. మా తమ్ముడు చనిపోయినప్పుడు ఆయన మీద కోపం వచ్చింది. తిట్టుకున్నాను. ఎంతో బాధపడ్డాను. ఇలా ఉండగా ఓ రోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో అమ్మా అనే పిలుపు వినిపించింది. ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఇంతలో గత ఏడు జన్మలుగా నువ్వే నా తల్లివి. మరో ఆరు సంవత్సారల్లో నేను నీ కడుపున పుడతాను అని చెప్పాడు’’ అని చెప్పుకొచ్చింది.
‘‘ఆ తర్వాత బాబా నాడు చెప్పినట్లుగానే ఆరేళ్ల తర్వాత నాకు కొడుకు పుట్టాడు. ఇదంతా బాబా మహిమే అనుకుని.. బాబుకు సాయి అని పేరు పెట్టుకున్నాను. బాబా దయ వల్లే నాకు ఆ కొడుకు పుట్టాడని నా నమ్మకం. నా జీవితంలో బాబా ప్రభావం ఎక్కువ’’ అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్న వారు నిజమేనా అని కామెంట్స్ చేస్తున్నారు.