చిన్న సినిమాగా విడుదలైన బలగం ఎంత బలమైన హిట్టు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ వసూళ్లు సాధించడమే కాక.. అనేక అంతర్జాతీయ అవార్డులు కొల్ల గొట్టింది. ఇక తాజాగా బలగం సినిమా మరో సారి వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు..
బలగం సినిమా.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. చిన్న సినిమాగా విడుదలై.. ఘనమైన విజయం సాధించింది. జబర్దస్త్ వేణు.. దర్శకుడిగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం బలగం ద్వారా.. బ్రహ్మాండమైన హిట్ కొట్టాడు. హీరో, హీరోయిన్ తప్ప మిగతా అందరూ కొత్త వారిని తీసుకుని.. తెలంగాణలోని ఓ సంప్రదాయాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన బలగం సినిమా మంచి విజయం సాధించడమే కాక.. అనేక అవార్డులు కూడా దక్కించుకుంది. ఈ సినిమా జనాలకు ఎంతలా కనెక్ట్ అయ్యిందంటే.. ఊర్లలో.. ఈ సినిమా ప్రత్యేక షోలు వేసి.. ఊరంతా ఒక్క చోట చేరి.. సినిమాను చూశారు. ఇక సినిమాల్లో క్లైమాక్స్ సాంగ్‌కు కన్నీళ్లు పెట్టని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇక బలగం సినిమా చూసి.. దూరమైన బంధాలు ఎన్నో చేరువయ్యాయి. ఇక తాజాగా బలగం సినిమా మరో సారి వార్తల్లో నిలిచింది. అదేంటంటే..
తాజాగా ఆదివారం నిర్వహించిన తెలంగాణ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. 2023 మార్చిలో ఒనికో ఫిలిమ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించిందని ప్రశ్నా పత్రంలో అడిగారు. ఉత్తమ దర్శకుడు చలన చిత్ర విభాగం, ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలుసా.. లేదా. ఉక్రెయిన్, ఒనికో ఫిలిం ఫెస్టివల్‌లో బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ (ఉత్తమ నాటకం చలన చిత్రం) విభాగంలో “బలగం” సినిమా అవార్డు గెలుచుకుంది.
దీంతో పాటు లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులలో రెండు పురస్కారాలను దక్కించుకుంది బలగం. ఉత్తమ దర్శకుడు (వేణు యెల్దండి), ఉత్తమ ఛాయాగ్రహణం (ఆచార్య వేణు) విభాగాల్లో బలగం సినిమాకు ఈ అవార్డులు దక్కాయి. ఇవే కాక.. ది గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాన్‌బుల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2023లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లీడ్ యాక్టర్ విభాగాల్లో బలగం సినిమా మూడు పురస్కారాలు అందుకుంది. అంతేకాక ఆమ్‌స్టర్‌డామ్‌లోని అరౌండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో వేణు యెల్దండి ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నాడు. ఇక మరో ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో 9 విభాగాల్లో “బలగం” మూవీ అవార్డులను అందుకుంది.
అడుగంటిపోతున్న బంధాలు, బంధుత్వాలు, మానవత్వం, తెలంగాణ యాస, పల్లె జీవితం, అమాయకపు ఆలోచనలు.. ఇలా ఎన్నో అంశాలను బలగం సినిమాలో చూపించారు. ఇక ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి సహా తదితరులు బలగంలో ముఖ్య పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. మరి బలగం సినిమాకు మీకు నచ్చిందా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.