పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఏడాది తర్వాత తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ కావడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా భారీ విజయం సాధించడంపై సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు శనివారం జరిగిన భీమ్లానాయక్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న త్రివిక్రమ్ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
“‘అయ్యప్పనమ్ కోషియం’ను తెలుగులోకి తీసుకురావాలని మొదట అనుకున్నప్పుడు.. మాకు కనిపించిన పెద్ద సమస్య ఏమిటంటే మలయాళంలో మొత్తం కథ కోషియం (తెలుగులో డేనియల్ శేఖర్) వైపు నుంచే ఉంటుంది. కానీ దాన్ని తెలుగువారికి అనుగుణంగా భీమ్లానాయక్ వైపు నుంచి ఎలా చెప్పాలి.. ఇద్దరి పాత్రలను సమానంగా ఎలా చూపాలి అనే దానిపై ఎన్నోసార్లు చర్చించుకున్నాం. అప్పుడు మాకు తట్టిన ఆలోచన.. అడవికి సెల్యూట్ చేయడం నుంచి ప్రారంభించి.. భీమ్లానాయక్ క్యారెక్టర్కు దగ్గరగా కథను తీసుకువెళ్తే న్యాయం చేయగలమనిపించింది. పవన్ ఇమేజ్. అభిమానులు ఏం కోరుకుంటారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సీనిని సహజంగా ఉండేలా క్రియేట్ చేశాం’’ అని తెలిపారు.ఈ సినిమా కోసం నటీనటులు ఎంతో కష్టపడ్డారు. ప్రస్తుతం వస్తోన్న కొత్త తరం నటీనటులకు సినిమాపై ప్యాషన్ ఎక్కువగా ఉంది. ఈ స్టేట్మెంట్తో ఎవరైనా బాధపడితే క్షమించండి. కానీ ఇప్పటితరం వాళ్లకు సినిమాపై ప్రేమ, ప్రతివిషయంలో వాళ్లకున్న అవగాహన గొప్పది. గణేశ్ మాస్టర్ స్టెప్పులు బాగా కంపోజ్ చేశారు. సుమారు 600 మందితో సాంగ్ షూట్ చేయడం సాధారణ విషయం కాదు. ఆ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లోకి వెళ్లగానే అక్కడ అంతమంది జనాన్ని చూసి నేను పారిపోయా. ఆయన 3 రోజుల్లోనే సాంగ్ చేశారు” అని తెలిపారు.
“సాగర్.. ఈ కథని ఎంతగానో అర్ధం చేసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి క్షణం ఆయన వెంటే మేమున్నాం. ఆయనకు వచ్చిన ఐడియా ప్రకారమే మొగిలయ్యతో పాట పాడించాం. ఆతర్వాత ఆయనకు పద్మశ్రీ రావడం.. మకెంతో ఆనందాన్ని ఇచ్చింది. కోవిడ్ సమయంలో పవన్-రానా ఎలాంటి భయం లేకుండా జనాల మధ్య పనిచేశారు. ఇక తమన్ నా కుటుంబసభ్యుడిలా పనిచేస్తాడు. నేను కథ చెప్పగానే పాటలిచ్చేస్తాడు. అతను ఈ మధ్య సంగీతంతో మాట్లాడుతున్నాడు” అన్నాడు త్రివిక్రమ్.