సినిమా పేరుతో ఇండస్ట్రీలో చాలానే మోసాలు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూసాము. సినిమా తీస్తున్నామని, పెద్ద పెద్ద సినిమాల్లో పెట్టుబడులు పెడితే బాగా లాభాలు వస్తాయని చెప్పి మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది అమాయకులను టార్గెట్ గా చేసుకుని సినిమా ఆఫీసులు తెరిచి మోసాలకు పాల్పడుతుంటారు. సినిమా తీస్తున్నామని చెప్పి డబ్బు, సమయం రెండూ వృధా చేస్తుంటారు. అలాంటి వాళ్లలో సినీ నటుడు నవీన్ రెడ్డి ఒకరు. సినిమా పేరుతో కంపెనీ డైరెక్టర్లను మోసం చేసిన నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డైరెక్టర్లకు తెలియకుండా వారి సంతకాలను ఫోర్జరీ చేసి.. వారి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కోడిపుంజులగూడెం గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి.. సినిమా పేరుతో మోసానికి పాల్పడ్డాడు. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్న నవీన్ రెడ్డి మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కంపెనీలోని మిగతా డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంతకాలు ఫోర్జరీ చేసి.. సుమారు రూ. 55 కోట్లు విలువ చేసే కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు బాధితులు, ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నవీన్ రెడ్డిపై 420, 465, 468, 471 ఆర్/డబ్ల్యూ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
విచారణ అనంతరం నవీన్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి.. చర్లపల్లి జైలుకు రిమాండ్ కు తరలించారు. ఎన్ స్క్వేర్ కంపెనీ డైరెక్టర్లను మోసం చేసిన డబ్బులతో నవీన్ రెడ్డి జల్సాలు చేశాడని.. నో బడీ అనే పేరుతో సినిమా కూడా తీసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక గతంలో నవీన్ రెడ్డిపై పలు బైక్ దొంగతనం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. నవీన్ రెడ్డి నటించిన నో బడీ సినిమాకు సంబంధించిన టీజర్ ను గత ఏడాది విడుదల చేశారు. చందు సీఆర్ దీనికి దర్శకత్వం వహించగా.. భావన చౌదరి హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్, వజ్ర, మురళీకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమాకి నవీన్ రెడ్డి అట్టూరి, నవీన్ పసునూరు నిర్మాతలుగా ఉన్నారు. సినిమా పేరుతో 55 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడన్న ఫిర్యాదుతో నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.