సంక్రాంతి పండుగ వచ్చిందంటే.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి పండుగని ఇళ్లలో ఎంత ఘనంగా జరుపుకుంటారో.. అంతకుమించిన జాతరని థియేటర్స్ లో జరుపుతుంటారు ప్రేక్షకులు. సంక్రాంతి అంటే.. చుట్టాలు, గాలిపటాలు, కోళ్ల పందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు మాత్రమే కాదు.. సినిమాలు కూడా పండగలో భాగమే. అందుకే సంక్రాంతిని ఇళ్లలో ఎంత గ్రాండ్ గా జరుపుకున్నా.. పనులన్నీ ముగిశాక ఫ్యామిలీస్ తో పాటు వెళ్లి థియేటర్స్ లో సందడి చేస్తుంటారు జనాలు. ప్రతి ఏడాది సంక్రాంతి అంటే.. సినీ ప్రేక్షకులకు.. సంక్రాంతి బరిలో పోటీపడనున్న హీరోలకు ఎంతో స్పెషల్.
ఈ క్రమంలో ప్రతి సంక్రాంతిని అభిమాన హీరోలనే కాదు.. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఏవి రిలీజ్ అయినా.. ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. పైగా సంక్రాంతికి చాలా రోజులు హాలిడేస్ ఉంటాయి. కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద మినిమమ్ రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. 2000 నుండి 2022 వరకు ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఈ ఇరవై మూడేళ్ళలో ప్రతి సంక్రాంతికి ఎన్నో సినిమాలు పోటీపడ్డాయి. కొన్నిసార్లు పోటీపడిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి.. మరికొన్నిసార్లు సంక్రాంతి విన్నర్ గా ఒక్కొక్క సినిమాలు కూడా నిలిచాయి. ఇప్పుడు 2023 సంక్రాంతికి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో ముస్తాబు అవుతున్నాయి.