తెలుగు ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది కాలం నుంచి.. ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు కన్ను మూస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే జమున మృతి చెందగా.. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నిర్మాత విద్యా సాగర్ రెడ్డి మృతి చెందారు. చెన్నైలోని ఆయన నివాసంలో.. గురువారం ఉదయం 5.20 గంటలకు సాగర్ తుది శ్వాస విడిచారు. తెలుగు ఇండస్ట్రీలో స్టువర్ట్పురం, అమ్మదొంగ వంటి సినిమాలకు సాగర్ దర్శకత్వం వహించారు. అంతేకాక తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సాగర్ మరణించారనే వార్త తెలిసి ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విద్యాసాగర్ రెడ్డి.. 1952లో గుంటూరులో జన్మించారు. కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాలకు ఎడిటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1983లో విడుదలైన ‘రాకాసి లోయ’ సినిమాతో తొలిసారి దర్శకుడిగా మారారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన స్టువర్టుపురం దొంగలు (1991) సినిమా ఆయనకు దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రం 3 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఆ తర్వాత ‘అమ్మ దొంగ, అన్వేషణ, ఓసి నా మరదలా’ వంటి చిత్రాలకు విద్యా సాగర్ రెడ్డి దర్శకత్వం వహించారు.. 2002లో వచ్చిన ‘ఖైదీ బ్రదర్స్’ దర్శకుడిగా విద్యా సాగర్ రెడ్డికి చివరి చిత్రం.
విద్యా సాగర్ రెడ్డి తుది శ్వాస విడిచారు అనే వార్త తెలిసి.. ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు సినీ ప్రముఖులు. టాలీవుడ్‌లో టాప్ దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్, శ్రీను వైట్ల, ఏఎస్ రవికుమార్ చౌదరి వంటి ఎంతో మంది దర్శకులకు వారి కెరీర్ ప్రారంభంలో విద్యా సాగర్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చారు. తెలుగు సినిమా దర్శకులు సంఘానికి అధ్యక్షుడిగా పని చేసే సమయంలో ఆయన అందరితో కలిసిపోయేవారని.. చిన్నా పెద్దా అనే తేడా చూపేవారు కాదని గుర్తు చేసుకుంటున్నారు. వయసులో తనకన్న చిన్నవారిని నాన్న అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఇండస్ట్రీలో మంచి వ్యక్తిగా పేరు సంపాదించుకున్న విద్యాసాగర్ రెడ్డి.. మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరి టాలీవుడ్‌లో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.