Kadali Jaya Sarathi: ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ హస్యనటుడు కడలి జయసారధి గారు నేడు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 2:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని సమాచారం.
ఇక మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జయసారధి అంత్యక్రియలు జరగనున్నాయి. కెరీర్ విషయానికి వస్తే.. 1960లో సీతారామకళ్యాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన సారధి.. అనేక చిత్రాలలో హాస్యాన్ని పండించే పాత్రలే పోషించారు. దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించిన ఆయన.. తనదైన శైలిలో కామెడీ పండించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అలాగే తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో కీలకపాత్ర వహించారు.
జయసారధి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) వ్యవస్థాపక సభ్యులు. అంతేగాక టాలీవుడ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా పనిచేసారు. నాటకరంగంలో కూడా రాణించారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి. పద్మనాభం వంటి గొప్పనటులతో కలిసి ఎన్నో నాటకాలలో ప్రతిభను చాటుకున్నారు. జయసారధి కేవలం నటుడు మాత్రమే కాదు.. విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా!
ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు చిత్రాలను నిర్మించారు. నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన జమిందార్ గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓ ఇంటి భాగోతం చిత్రాల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్ని సారధి గారే చూశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్ లో నిర్మించిన చిత్రాలకు సారధి టెక్నికల్ వర్క్ చూసుకునేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో కూడా సారధి గారు కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం జయసారధి మృతికి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరి గొప్ప కమెడియన్ మృతిపట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.