చిరంజీవి.. ఒక నటుడిగా తన ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు మెగాస్టార్‌గా, అందరివాడిగా, అన్నయ్యగా, ఆయన ఒప్పుకోకపోయినా.. టాలీవుడ్ పెద్దన్నగా కొనసాగుతున్నారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన చేసిన సాయాలు లెక్కల్లో చెప్పమంటే జరిగే పని కాదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఔన్నత్యం కలిగిన వ్యక్తి. అలాంటి చిరంజీవిపై చిర్రుబుర్రులాడి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇప్పుడు ఎన్నో విమర్శలు, పెదవి విరుపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. నేను చిరంజీవితో మాట్లాడతాను అంటూ గరికపాటి చెప్పినప్పటికీ.. మెగా అభిమానులు మాత్రం గరికపాటి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా గరికపాటి వ్యాఖ్యలను ఎండగడుతున్నారు.
ఇప్పుడు ఇదే విషయంపై తెలుగు ఇండస్ట్రీ నుంచి గరికపాటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు ప్రత్యక్షంగా స్పందిస్తే.. ఇంకొందరు పరోక్షంగా గరికపాటి ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. చిరంజీవి ఫొటోల కోసం ఎగబడుతున్నారా? చిరంజీవితో ఫొటోలు దిగేందుకు జనం ఎగబడుతున్నారా? చిరంజీవి గారు మీరు ఆ ఫొటో సెషన్ ఆపండి అని అనడంలో మీ అంతరార్థం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అవధానిగా మీరు సాధించిన జ్ఞానం, సరస్వతీ కటాక్షం, స్నితప్రజ్ఞత ఇదేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మీరు చెప్పే ప్రవచనాలు, మాటలను మీరే ఆచరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఆపకపోతే వెళ్లిపోతానంటూ కుర్చీలోంచి లేవడం ఏంటండి? అంత సంయమనం కోల్పోవాల్సిన అవసరం ఏముంది? అసలు మీరు చేసిన పని తప్పో ఒప్పో అని అయినా మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? అంటూ నెట్టింట ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మెగా అభిమానిగా, ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా ఉత్తేజ్ ఈ విషయంపై గరికపాటికి ఓపెన్ లెటర్ రాశాడు. “చిరంజీవి అన్నయ్య గురించి మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది గరికపాటి గారు. చిరంజీవి ఫొటోల కోసం ఎగబడతారా? ఆయనతో ఫొటోల కోసం మేము ఎగబడతామా? కదా.. మీకు తెలయందా ఇది!!?” అంటూ ఉత్తేజ్ ఎమోషనల్‌గా, ఎంతో వినయంగా గరికపాటి నరసింహారావుకి ఓపెన్ లెటర్ రాశాడు. ఇంక సినిమా దర్శకుడు ఆదిత్య సైతం ఈ వివాదంపై స్పందించాడు. కాకపోతే ఆయన పరోక్షంగా గరికపాటికి చురకలు వేశారు. “రాముడు వినయం ఉండటం వల్లే హీరో అయ్యాడు. రావణబ్రహ్మ మహా విజ్ఞాని, గొప్పవాడు అయినా అహంకారం వల్ల విలన్ అయ్యాడు. అశోకవనంలో సీతాదేవి గడ్డిపరకతో ఎవరిని పోల్చింది? వినయంగా ఒదిగున్న హీరోనా.. విజ్ఞానమున్నా, అహంతో ఎగిరిపడ్డ విలన్నా.. కొంచెం తెలిస్తే చెప్పండి..( నాక్కాదు )” అంటూ ఆదిత్య కామెంట్ చేశాడు.