చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు సినీ అభిమానులను కలచివేస్తున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాతలు, నటీనటుల నుండి ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల మరణవార్తలు తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఒక సెలబ్రిటీ మరణవార్తను మరిచేలోపే మరొకరి గురించి షాకింగ్ న్యూస్ తెలిసే సరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారు ప్రేక్షకులు. తాజాగా అలనాటి అందాల నటుడు హరనాథ్ కుమార్తె పద్మజా రాజు కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. కాగా.. మంగళవారం మధ్యాహ్నం ఆమె హార్ట్ ఎటాక్ తో మృతి చెందినట్లు సమాచారం.
పద్మజా రాజు భర్త.. జి.వి.జి రాజుకి నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి పేరుంది. పద్మజకు ఇద్దరు కుమారులు. అలాగే ఆమె సోదరుడు శ్రీనివాస్ రాజు కూడా ఇండస్ట్రీలో నిర్మాతే కావడం విశేషం. అయితే.. హరనాథ్ కూతురిగా ప్రేక్షకులకు, ఇండస్ట్రీ వర్గాలకు పరిచయం ఉన్నప్పటికీ.. మొదటి నుండి ఆమె భర్త, నిర్మాత జివిజి రాజుకు చేదోడువాదోడుగా ఉంటూ వస్తున్నారు. అలాగే నిర్మాతగా జివిజి రాజు పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత, తొలిప్రేమ సినిమాలతో పాటు శేఖర్ కమ్ముల రూపొందించిన బ్లాక్ బస్టర్ గోదావరి మూవీ కూడా తెరకెక్కింది.
ఇదిలా ఉండగా.. ఇటీవలే పద్మజా రాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాల రాముడు’ అనే పుస్తకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పుస్తకాన్ని దివంగత సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అంతేగాక త్వరలోనే తమ కుమారులలో ఒకరు ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలోకి రాబోతున్నట్లు పద్మజా రాజు ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది కుమారుడిని నిర్మాతగా పరిచయం చేయాలనుకున్న పద్మజా రాజు.. ఆకస్మికంగా కన్నుమూయడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. పద్మజా మరణ వార్త తెలిసిన ఇండస్ట్రీ ప్రముఖులు, నటీనటులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక ప్రస్తుతం పద్మజా రాజు మృతిపట్ల సంతాపంగా తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు.
‘తొలిప్రేమ’ నిర్మాత జి.వి.జి.రాజు భార్య పద్మజా రాజు (54) ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటుతో కన్నుమూశారు. నాటి తరం అందాల నటుడు హరనాథ్ కుమార్తె పద్మజా రాజు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతే!#GokulamLoSita #ToliPrema #godavari #GVGRaju @PawanKalyan #Haranath #Prabhas #PadmajaRaju pic.twitter.com/FFjFVd33qd
— Omprakash Narayana Vaddi (@omprakashvaddi) December 20, 2022