సినిమా, మీడియా అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు. కష్టాల కడలి కూడా. కానీ.., ఇక్కడ ఎదురయ్యే ఆ కష్టాలను చిరునవ్వుతో భరించగలిగితే ఓ జీవితానికి సరిపడే కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవచ్చు. ఇందుకు ప్రముఖ జర్నలిస్ట్ టి.ఎన్.ఆర్ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నో ఆశలతో, ఆశయాలతో జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తుమ్మల నరసింహ రెడ్డి కరోనాతో అకాలంగా కన్నుమూసిన విషయం తెలిసిందే. కానీ.., ఆయన మరణించిన మరు క్షణం నుండి ఎంత మంది దుఃఖిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓ సాధారణ జర్నలిస్ట్ కి ఇంతటి ఆదరణ ఎలా సాధ్యం అయ్యింది? అసలు టి.ఎన్.ఆర్ జీవిత ప్రస్థానం ఎలా సాగిందన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలోనే మంచిర్యాల దగ్దర ఉన్న జైపూర్ అనే గ్రామంలో టి.ఎన్.ఆర్ జన్మించారు. ఆయన తండ్రి రాజారెడ్డి ఆ ఊరి సర్పంచ్. టి.ఎన్.ఆర్ రెండేళ్ల వయసులోని తల్లి చనిపోయింది. అక్కయ్య ఒక్కటే ఆయనకి తోడు. చిన్నతనం నుండే టి.ఎన్.ఆర్ కి సినిమాలంటే ఇష్టం. చిరంజీవి అంటే మాటల్లో చెప్పలేని అభిమానం. మెగాస్టార్ సినిమాల పేపర్ కటింగ్స్ లేకుండా.. టి.ఎన్.ఆర్ పుస్తకాలు ఉండేవి కాదు. అప్పటి నుండే ఊరిలో వారంతా టి.ఎన్.ఆర్ ని సినిమా పిచ్చోడని ఎగతాళి చేయడం ప్రారంభించారు. కానీ.., ఆ సినిమా పిచ్చే ఆయన్ని అత్యున్నత స్థాయిలో నిలబెడుతుందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేకపోయారు.
కొన్నేళ్ల తరువాత టి.ఎన్.ఆర్ కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. బీకామ్ పూర్తి చేసిన టి.ఎన్.ఆర్.. తరువాత కాలంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. కానీ.., దేవదాస్ కనకాల వద్ద కోర్స్ పూర్తి అయ్యాక కూడా టి.ఎన్.ఆర్ అవకాశాలను అందుకోలేకపోయారు. తరువాత తప్పనిసరి పరిస్థితిల్లో ఎల్.బి. శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా జాయిన్ అయ్యాడు. రాజశేఖర్ నటించిన ఓంకారం మూవీతో టి.ఎన్.ఆర్ సినీ ప్రయాణం మొదలైంది. ఆ తరువాత.. పిట్టలదొర సినిమాకి కో-డైరెక్టర్ గా పని చేశాడు. కానీ.., ఇక్కడ కూడా మళ్ళీ అంతగా అవకాశాలు లభించలేదు. ఇక ఖాళీగా ఉండటం ఇష్టం లేక తెలుగు మీడియా రంగం వైపు అడుగులు వేశాడు టి.ఎన్.ఆర్. ఇక్కడ మాత్రం తుమ్మల నరసింహ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆయన హ్యాండిల్ చేసిన నేరాలు-ఘోరాలు పోగ్రామ్ అప్పట్లో సూపర్ హిట్. తరువాత కాలంలో కూడా ప్రముఖ మీడియా ఛానెల్స్ లో టి.ఎన్.ఆర్ ప్రస్థానం కొనసాగింది.ఈ క్రమంలోనే ప్రియురాలు పిలిచే, డిటెక్టివ్ పరమేశం, అయ్యప్ప మహిమలు, అహల్య లాంటి పోగ్రామ్స్ కి ఎపిసోడ్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇలా మీడియా రంగంలో బిజీగా ఉంటూనే.., ఇండస్ట్రీలో నటుడిగా తన ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు టి. ఎన్. ఆర్. ఈ క్రమంలో బోణి, జయీభవ, పంచముఖి లాంటి సినిమాల్లో నటించాడు. కానీ.., ఇవేవి ఆయనకి మంచి పేరు తెచ్చి పెట్టలేకపోయాయి. ఆ డిప్రెషన్ లోనే మీడియా జాబ్ కూడా వదిలేశారు. ఇలా లైఫ్ లో ఓ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో టి.ఎన్.ఆర్ ఐడ్రీమ్స్ అనే డిజిటిల్ మీడియాలో జాయిన్ అయ్యాడు. అక్కడ సినిమా సమీక్షలు రాయడం మొదలు పెట్టారు. వాటికి మంచి పేరు వచ్చింది. ఈ ఉత్సాహంతో టి.ఎన్.ఆర్ “ఫ్రాంక్లి విత్ టి.ఎన్.ఆర్” పేరుతో ఇంటర్వూస్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ నుండి టి.ఎన్.ఆర్ వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. దర్శకుడు తేజతో మొదలైన ఆ పోగ్రామ్.. మొత్తం 189 ఇంటర్వూస్ వరకు కొనసాగి.., యూట్యూబ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీనితో ఈసారి టి.ఎన్.ఆర్ అడగకుండానే ఆయనకి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ.., కెరీర్ లో ఇప్పుడిప్పుడే సక్సెస్ టేస్ట్ చూస్తున్న టి.ఎన్.ఆర్ అకాల మరణం చెంది అందరిని శోక సంద్రంలోకి నెట్టేశారు. ఆయన కార్యక్రమాలు, ఇంటర్వూస్, సినిమాలు మన మధ్య ఉన్నంత కాలం తుమ్మల నరసింహ రెడ్డి చిరంజీవే.
( నోట్ : ఐ డ్రీమ్ లో టి.ఎన్.ఆర్ గురించి వచ్చిన ఓ ఆర్టికల్ ఆధారంగా ఈ స్క్రిప్ట్ రాయడం జరిగింది)