2023.. సంక్రాంతి బాక్సాఫీస్ వార్ కి రంగం సిద్ధం అవుతోంది. నలుగురు స్టార్ హీరోల సినిమాలు పొంగల్ ని క్యాష్ చేసుకునేందుకు దూసుకొస్తున్నాయి. అవును.. ఇదివరకు ఎన్నడూ చూడని రేంజ్ ఫైట్ ని ఒక పాజిటివ్ వాతావరణంలో చూడబోతున్నాం. ఎందుకంటే.. తెలుగులో సంక్రాంతి బిగ్ ఫైట్ ని ఒకేరోజు క్లాష్ అవ్వకుండా రిలీజ్ డేట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈసారి సంక్రాంతిని రెండు తమిళ డబ్బింగ్ సినిమాలతో.. రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో సెలబ్రేట్ చేసుకోనున్నారు ప్రేక్షకులు. జనవరి 11న అజిత్ ‘తెగింపు’, జనవరి 12న బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’, జనవరి 13న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, జనవరి 14న విజయ్ ‘వారసుడు’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఇప్పటికే సినిమాలకు సంబంధించి ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. సాంగ్స్ తో పెరిగిన హైప్ ని ట్రైలర్స్ తో ఒక్కసారిగా రెట్టింపు చేసేశారు. పైగా చాలాకాలం తర్వాత ఇక్కడ ఇద్దరు హీరోలు బాలకృష్ణ, చిరంజీవి.. అక్కడ ఇద్దరు హీరోలు అజిత్, విజయ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సినిమాలకు సంబంధించి ట్రైలర్స్ రావడంతో ఒక సినిమాతో మరో సినిమాని పోల్చి చూస్తున్నారు ఫ్యాన్స్. తెగింపు, వారిసు(తమిళ).. వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ట్రైలర్స్ వచ్చాక 24 గంటలలో ఏ మూవీ ట్రైలర్ కి ఎక్కువ వ్యూస్, లైక్స్ వచ్చాయనేది హాట్ టాపిక్ గా మారింది.
తమిళంలో చూస్తే.. అజిత్ తెగింపు ట్రైలర్ కి 24.96 మిలియన్ వ్యూస్, 1.14 మిలియన్ లైక్స్ వచ్చాయి. విజయ్ వారిసు ట్రైలర్ కి 23.05 మిలియన్ వ్యూస్, 1.83 మిలియన్ లైక్స్ వచ్చాయి. అయితే.. వ్యూస్ పరంగా తెగింపు టాప్ లో ఉన్నా.. లైక్స్ లో మాత్రం వారిసు టాప్ ఉండటం గమనార్హం. పైగా అజిత్ పెద్దగా ప్రమోషన్స్ చేయడని తెలిసిందే. విజయ్ వారిసు కోసం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుపుతున్నాడు. చూడాలి మరి.. దాదాపు 9 ఏళ్ళ తర్వాత అజిత్ – విజయ్ ల సినిమాలు క్లాష్ అవుతున్నాయి. పైగా ఇది సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి.. ఇంకా స్పెషల్ గా ఉండబోతున్నాయనే చెప్పాలి. తెగింపుని బోనీకపూర్ నిర్మించగా.. హెచ్ వినోద్ తెరకెక్కించాడు. వారిసుని దిల్ రాజు నిర్మించగా, వంశీ పైడిపల్లి రూపొందించాడు. చూడాలి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించనుందో!
ఇక తెలుగులో 24 గంటల లెక్కన చూసుకుంటే.. బాలకృష్ణ వీరసింహారెడ్డి ట్రైలర్ కంటే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య ట్రైలర్‌కే ఎక్కువ రెస్పాన్స్ రావడం గమనార్హం. వాల్తేరు వీరయ్య ట్రైలర్ కి 24 గంటల్లో 11.77 మిలియన్ వ్యూస్, 471.8k లైక్స్ వచ్చాయి. వీరసింహారెడ్డి ట్రైలర్ కి 8.01 మిలియన్ వ్యూస్, 382.6k లైక్స్ వచ్చాయి. కానీ.. ఓవర్సీస్ రిలీజ్ విషయంలో వీరసింహారెడ్డి కాస్త ముందుందని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య కంటే వీరసింహా రెడ్డికి ఎక్కువ లొకేషన్లు రావడం, ఆయా లొకేషన్లలో వీరయ్య సినిమా కంటే వీరసింహారెడ్డికి ఎక్కువ టిక్కెట్లు బుక్ అవ్వడం విశేషం. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీస్ వారే నిర్మించారు. ట్రైలర్స్ రెస్పాన్స్ బట్టి చూస్తే.. ఓవరాల్ గా నాలుగు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేసేలా ఉన్నాయని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
Thats the result of 24hrs 💥#WaltairVeerayya #VeeraSimhaReddy #Varisu #Thunivu
Follow us 👉 @tollymasti pic.twitter.com/NQDcN8iZDE— Tollymasti (@tollymasti) January 9, 2023