కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే వార్త అందరినీ ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. ఆయన చనిపోయి 11 రోజులు అయ్యింది.. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా పునీత్ గురించే ప్రస్థావన. చనిపోయిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ చేసిన ఎన్నో గొప్ప పనులు, మరెన్నో సేవాకార్యక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఒక గొప్ప వ్యక్తి కుమారుడిగా పునీత్ ఈ సమాజానికి ఎంతో చేశాడు. మాటలు కాదు.. చేతల్లో చూపించాడు. ఒక వ్యక్తిని దేవుడిగా కొలుస్తున్నారంటే ఆయన వాళ్లకు ఎంత చేసుంటాడు? ఎందరి కుటుంబాల్లో వెలుగులు నింపి ఉంటాడు. ఆయన మీదున్న అభిమానం మరోసారి బయటపడింది. దశదిన కర్మ రోజు దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పునీత్ కోసం వచ్చిన వేలాదిమందిని చూసి ఎంత గొప్ప వాడివయ్యా పునీత్ నువ్వు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
దశదిన కర్మ అంటే మామూలుగా తమ వాళ్లను, ఊరి వాళ్లను, కులం వాళ్లనో పిలుస్తుంటారు. కానీ, పునీత్ కుటుంబసభ్యులు మాత్రం అభిమానులు అందరికీ ఆహ్వానం తెలిపారు. అదేదో సత్రంలో అన్నదానం తరహాలో కాకుండా.. అందరికీ అరిటాకులో మంచి భోజనం పెట్టారు. ప్రతి ఒక్కరిని తమ సొంత కుటుంబసభ్యుల్లాగే చూసుకున్నారు. అందరికీ ఆహ్వానం పులుకుతూ అతిథి మర్యాదలతో సాగనంపారు. భార్య, ఇద్దరు అన్నలు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50 నుంచి 60 వేల మంది హాజరై ఉంటారని అంచనా.
పునీత్ రాజ్ కుమార్ అభిమానులపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పునీత్ చనిపోయిన రోజు, కంఠీరవ స్టేడియంలో పునీత్ పార్థీవదేహాన్ని సందర్శనకు ఉంచిన సమయంలో, దశదిన కర్మ రోజు ఇలా ప్రతి సందర్భంలో వాళ్లు కనబరిచిన క్రమశిక్షణ, నడవడిక చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అభిమానులు అందరూ తమ కుటుంబమే అని మాటల్లో కాకుండా.. చేతల్లో చూపించిన పునీత్ కుటుంబంపై కూడా అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ అభిమానుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.