ఈ వారం థియేటర్స్ లో జైలర్, భోళా శంకర్ సినిమాలు విడులవుతున్నాయి. వీటితో పాటు మహేష్ బాబు నటించిన బిజినెస్ మేన్ సినిమా రీ రిలీజ్ అవుతుంది. మరోవైపు ఓటీటీలో 25 సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఏ సినిమా ఎందులో ఉందో, ఏ వెబ్ సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో అనే వివరాలు మీ కోసం.
ఒక తెలుగు సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్లు ఒక్కొక్కరికి ఒక్కో సీజన్..ఇప్పుడు ఇది మా సీజన్ అని సినిమా ప్రేక్షకులు చెప్పుకునేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. నేడు సినిమా అనేది ప్రపంచవ్యాప్తమైపోయింది. భాషతో సంబంధం లేకుండా ఇప్పుడు కేవలం సినిమా లవర్స్ మాత్రమే వున్నారు. సినిమా లవర్స్ కోసం గురువారం నుంచే సినిమా జాతర మొదలవుతుంది. ఇది మామూలు జాతర కాదు సినిమా ప్రేక్షకుడికి గాని సినిమాకి గాని అలుపు రాని జాతర. ప్రపంచవ్యాప్తంగా రెండు మెగా మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా ఇంట్లోనే ఉండి చూసుకునే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు తో కలిపి ఏకంగా 25 రిలీజ్ కాబోతున్నాయి.ఈ వార్త సినీ ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు.
అన్నిటికంటే ముందుగా థియేటర్ లోకి అడుగుపెడుతున్న మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా కసిగా వెయిట్ చేస్తున్నారు రజినీ ఫ్యాన్స్. గత కొంత కాలంగా రజినీకి సరైన హిట్ లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ మీద రజినీకాంత్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా ట్రైలర్ అండ్ రజినీ లుక్స్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసాయి. మార్కెట్ లో జైలర్ మూవీ ఆడియో పరంగా పెద్ద సంచలనమే సృష్ఠ్టించింది. నువ్వు కావాలయ్యా అనే పాట ఇండియా మొత్తం మారుమోగుతుంది. రజినీకి జోడిగా తమన్నా నటిస్తున్నఈ మూవీలో రమ్యకృష్ణ ఒక ప్రధాన పాత్ర పోషించింది. గతంలో రజినీకాంత్, రమ్యకృష్ణ ప్రత్యర్థులుగా నటించిన నరసింహ మూవీ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. అలాగే మోహన్ లాల్ లాంటి పవర్ ఫుల్ ఇండియన్ యాక్టర్ తోడవడం కూడా ఈ మూవీకి అదనపు బలంగా నిలిచింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ జైలర్ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఈ జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. మెగాస్టార్ స్టామినా గురించి కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. ఆచార్యతో నిరుత్సాహపరిచిన చిరంజీవి.. ఆ తర్వాత వాల్తేరు వీరయ్యతో సూపర్ సక్సెస్ కొట్టి తన ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి ఫుల్ మజాని ఇచ్చారు. ఇప్పుడు భోళాశంకర్ మూవీతో వాళ్ళ ఉత్సాహాన్ని డబుల్ చేయడానికి సిద్ధమయ్యారు. ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది మెగా స్టార్ తన మాస్ మానరిజాన్ని ఇంకో లెవెల్లో చూపించబోతున్నారని. అలాగే చిరంజీవి పేటెంట్ హక్కైనా కామెడీని కూడా వీర లెవల్లో పండించబోతున్నారని తెలుస్తుంది. తమిళ మూవీ వేదాలంకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో కింగ్ నాగార్జున మేనల్లుడు సుశాంత్ కీర్తి సురేష్ లవర్ గా చేస్తున్నాడు.మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ బోళా శంకర్ మూవీని నిర్మించారు.
ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.