సాధారణంగా సినీ ప్రేమికులను అలరించేందుకు ప్రతీ వారం చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు రెడీ అవుతున్నాయి. ఇదివరకంటే ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలోకి దిగడం చూసేవాళ్ళం. కొంతకాలంగా మూవీ రిలీజుల విషయంలో ట్రెండ్ మారిపోయింది. వారానికి మూడు నాలుగు సినిమాలకు పైగా థియేటర్స్ లో పోటీ పడుతున్నాయి. అయితే.. ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరించే తీరులో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు హీరోలను బట్టి కాదు.. కంటెంట్ బట్టే సినిమాలను ఆదరిస్తున్నారు.
ఇక ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు స్టార్ హీరోల సినిమాలు సిద్ధమయ్యాయి. అయితే.. ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలలో ఒక్కటి కూడా తెలుగు స్ట్రయిట్ మూవీ లేకపోవడం గమనార్హం. బాక్సాఫీస్ బరిలోకి ఈ వారం మూడు సినిమాలు కూడా ఒరిజినల్ తమిళ కంటెంట్ తో వస్తుండటం విశేషం. ఈ గురువారం ధనుష్ హీరోగా ‘నేనే వస్తున్నా’.. శుక్రవారం మణిరత్నం తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘పొన్నియన్ సెల్వన్-1’, హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన ‘విక్రమ్ వేద’ మూవీస్ విడుదల కాబోతున్నాయి.
ధనుష్ నటించిన ‘నేనే వస్తున్నా’ మూవీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రాబోతుండగా.. ఈ సినిమాను సెల్వరాఘవన్ తెరకెక్కించారు. ఇక సెప్టెంబర్ 29న ‘నేనే వస్తున్నా’ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్-1’. రెండు భాగాలుగా ఈ మూవీని.. ఓ పాపులర్ నవల ఆధారంగా తెరకెక్కించారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష చాలామంది ప్రముఖులు నటించారు.
ఈ క్రమంలో పొన్నియన్ సెల్వన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇక మూడో సినిమా ‘విక్రమ్ వేద’. హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ మూవీ.. 2017లో విడుదలైన ‘విక్రమ్ వేద’ మూవీకి రీమేక్. ఒరిజినల్ మూవీని రూపొందించిన పుష్కర్ – గాయత్రీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక హిందీ భాషలో ఈ మూవీ వరల్డ్ వైడ్.. సెప్టెంబర్ 30న రిలీజ్ అవుతోంది. మొత్తానికి ఈ వారం డబ్బింగ్ సినిమాలే తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి. అయితే ఈ మూడు సినిమాలలో అందరి చూపు పొన్నియన్ సెల్వన్ పై ఉన్నట్లు తెలుస్తుంది.