ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. కొన్నిసార్లు భారీ అంచనాలతో భారీస్థాయిలో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తుంటాయి. మరికొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. దీనిలో రెండో కోవకే చెందుతుంది ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఎలాంటి హడావిడి లేకుండా పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ తో పోటీగా రిలీజయ్యింది ఈ సినిమా.
వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. 15 కోట్ల రూపాయల లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. విడుదలైన మొదట్లో ఎలాంటి హైప్ లేని ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో మెల్లమెల్లగా రాధేశ్యామ్ ను బీట్ చేసింది. ప్రేక్షకులే సినిమాను దేశవ్యాప్తంగా అన్ని ఏరియాలలో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయాలనీ కోరడంతో మేకర్స్ థియేటర్స్ సంఖ్య పెంచారు.
ఇక సినిమా రిలీజైన 5వ రోజు నుండి కలెక్షన్స్ అమాంతం పెంచుకుంటూ పోయింది. 1990 కాలంలో కశ్మీర్ పండిట్ ల పట్ల అరాచకాలను తెరపై ఆవిష్కరించిన సినిమా ఇది. ప్రధాని మోడీ దగ్గరనుండి సామాన్యుడి వరకు అందరూ సినిమాపై ప్రశంసలు కురిపించి.. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో కశ్మీర్ ఫైల్స్ కలెక్షన్స్ లో ఊహించని స్థాయిలో లాభాలను మూటగట్టుకుంది. కేవలం 15 కోట్లతో రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద 234 కోట్ల కలెక్షన్స్ దాటి 250 కోట్ల వైపు దూసుకెళ్తుండటం విశేషం.
ఇటీవలే కశ్మీర్ ఫైల్స్.. 200 కోట్ల క్లబ్ లో చేరింది. మరి 15 కోట్లతో తెరకెక్కిన సినిమా 250 కోట్ల కలెక్షన్స్ వైపు వెళ్తుండటం రికార్డు అనే అంటున్నాయి సినీ ట్రేడ్ వర్గాలు. ఇప్పటికీ ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది. మరి ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 250 కోట్లు కలెక్షన్స్ క్రాస్ చేసిన సినిమాలు రాలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి కశ్మీర్ ఫైల్స్ సాధిస్తున్న కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.